మంత్రి కొడాలి నానికి దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2020-09-05T22:31:36+05:30 IST

ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల మీడియా మీట్ నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

మంత్రి కొడాలి నానికి దివ్యవాణి స్ట్రాంగ్ కౌంటర్

అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల మీడియా మీట్ నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై దేవినేని ఉమా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా నాని వ్యాఖ్యలపై  టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొడాలి నాని పనితీరు, మాటలు ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు. నానీని చూస్తుంటే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు ఉందని ఆమె ఆరోపించారు. కరోనా ప్రభావం తెలిసుంటే ఆయన.. చంద్రబాబు వేషధారణ గురించి మాట్లాడేవారు కాదన్నారు. చంద్రన్నది నిజంగా చంద్రమండలం స్థాయేనని కొడాలి తెలుసుకోవాలని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. 


నాని మాటల్లోనే తెలుస్తోంది..!

చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడనే నాని, ఆనాడు జరిగిన పరిణామాలకు తనే స్క్రిప్ట్ రాశాడా?. ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానీకి తెలియదా?. ఖర్జూర నాయుడి గారి కుటుంబం రౌడీయిజంతో, ఫ్యాక్షనిజంతో పైకి రాలేదు. చంద్రబాబు వయస్సు గురించి, చావుల గురించి మాట్లాడటానికి నాని ఏమైనా యమధర్మరాజుకి శిష్యుడా?. ఇప్పటికైనా సరే, వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా సరే చంద్రబాబుతో సమానంగా పనిచేయగలరా?. నానికి చంద్రబాబుపై ఎంత ద్వేషముందో.. ఆయన మాటల్లోనే తెలుస్తోంది. చంద్రబాబు గురించి ఒకపేపర్‌లో చులకనగా రాశారని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును.. నాని లాంటి వాళ్లు ఎన్ని అన్నా, ఆయన తెల్లవెంట్రుకల్లో ఒక్కటి కూడా కదలదు. లారీలతో గుద్దిస్తామనే ఆలోచనలు మంత్రిస్థాయిలో ఉండి చేయడం బాధాకరం. లక్షకోట్ల అప్పులు తెచ్చి, ఏం చేశారో చెప్పకుండా, ప్రశ్నించినవారిని చంపేస్తాం.. లేపేస్తాం అని బెదిరిస్తారా?. వైఎస్ జగన్ ప్రజలసొమ్ముని కోర్టు ఖర్చులకు దుబారా చేయకుండా, ఆ సొమ్ముతో తన పార్టీవారికి సభ్యత, సంస్కారాలు నేర్పితే మంచిది.  మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే, ఎక్కడో పెట్టుకున్నట్టు, మంత్రి పదవితో నాని ఏం చేస్తున్నాడో తెలియడం లేదు?అని నానిపై దివ్యవాణి ఘాటు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-09-05T22:31:36+05:30 IST