కరోనా వ్యాప్తిలో ఏపీ... ఢిల్లీని మించిపోతుంది: దేవినేని

ABN , First Publish Date - 2020-07-27T17:17:12+05:30 IST

కరోనా వ్యాప్తిలో ఏపీ... ఢిల్లీని మించిపోతుంది: దేవినేని

కరోనా వ్యాప్తిలో ఏపీ... ఢిల్లీని మించిపోతుంది: దేవినేని

అమరావతి: రాబోయే 5, 6 రోజుల్లో కరోనా వ్యాప్తిలో రాష్ట్రం ఢిల్లీని మించిపోతుందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని చెబుతున్న మాటలు ముఖ్యమంత్రికి వినబడుతున్నాయా? అని ప్రశ్నించారు. వేగంగా వైరస్ వ్యాపిస్తున్నా, ముఖ్యమంత్రి ఎందుకు తన పాలనావిధానం మార్చుకోవడం లేదని నిలదీశారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ త్యాగాలను గౌరవించాల్సిన పనిలేదా అని మండిపడ్డారు. క్వారంటైన్ కేంద్రాల్లోని భోజనం తినలేక రోగులు ఛస్తున్నా పట్టించుకోరా అంటూ దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని రాష్ట్ర కోవిడ్ ఆసుపత్రిలో ఎన్ని పడకలున్నాయో, వెంటిలేటర్లున్నాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. 


ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమంటారని.. అక్కడికి వెళితే ఖాళీ లేదంటారని ఆయన అన్నారు. గుంటూరు ఆసుపత్రిలో 30 మృతదేహాలున్నాయని... తెనాలిలో పారామెడికల్ సిబ్బంది మాస్కులు, కిట్ల కోసం రోడ్డెక్కారని తెలిపారు. ప్రశ్నించేవారిని వేధింపులకు గురిచేయడం తప్ప, ప్రభుత్వం వాస్తవాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మీడియా ముందుకొచ్చి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 


బాధ్యత గల ప్రతిపక్షనేత చేస్తున్న మాత్రం కూడా ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోతున్నాడని అడిగారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.8వేలకోట్లు దేనికి ఖర్చు చేశారని అని దేవినేని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం..నేషనల్ పర్మిట్ లారీల్లా తిరిగి కరోనా వ్యాపింపచేసి, వెళ్లి పక్కరాష్ట్రాల్లో పడుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రతివారం నీతిఅయోగ్ దృష్టికి కరోనా సమస్య తీవ్రతను తీసుకెళుతున్నారని దేవినేని ఉమ వెల్లడించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే జే-ట్యాక్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదా అని మండిపడ్డారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా పక్కరాష్ట్రాల నుంచి తెచ్చి మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. మైలవరం నియోజకవర్గంలో  యథేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నాయన్నారు. ఇసుక, మద్యం, భూముల అమ్మకం తప్ప  మంత్రులకు ఏమీ పట్టడం లేదని విమర్శించారు.


ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రాసాదం దాటి బయటకు రాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలను చనిపోయిన వారి బంధువులకు అప్పగించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ప్రజలకు మనోధైర్యం కల్పించలేని ప్రభుత్వం ఎందుకని...కరోనా బాధితుల గోడు వారి వెతలు ముఖ్యమంత్రికి వినబడటం లేదా అంటూ ప్రశ్నించారు. ఆగస్ట్ 15 నాటికి విశాఖ వెళ్లడంపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని విమర్శించారు. 2014లో చంద్రబాబుని గెలిపించారని జగన్ ప్రజలపై కక్ష పెంచుకున్నాడా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు బెయిల్ రాకుండా చేయాలన్న దానిపై ఉన్న శ్రద్ధ కరోనా నివారణపై లేదని అన్నారు. రేషన్ డీలర్లకు కమీషన్ ఇవ్వకుండా 30వేల కుటుంబాలను అభద్రతా భావంలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థతో రెవెన్యూ, పంచాయతీ రాజ్ వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని తెలిపారు.


పార్టీ నాయకుడు, వాలంటీర్, ఎమ్యెల్యేల చుట్టూ తిరిగినా రైతుకు ఒక్క విత్తనం ప్యాకెట్ కూడా అందడం లేదన్నారు. తాను చేసిందే పరిపాలన అన్నట్లుగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని దేవినేని మండిపడ్డారు. ధాన్యం రైతులకు చెల్లించాల్సిన రూ.246కోట్లు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. సుబాబుల్‌ని రూ.1400కు కూడా కొనేవారు లేరన్నారు. సున్నావడ్డీ సహా, అనేక కార్యక్రమాలతో ప్రభుత్వం రైతులను నిలువునా మోసగిస్తోందని దేవినేని ఉమ ఆరోపణలు గుప్పించారు. 

Updated Date - 2020-07-27T17:17:12+05:30 IST