నవరత్నాల పేరుతో దగా: బోండా ఉమ

ABN , First Publish Date - 2020-05-09T17:23:34+05:30 IST

నవరత్నాల పేరుతో దగా: బోండా ఉమ

నవరత్నాల పేరుతో దగా: బోండా ఉమ

అమరావతి: నవరత్నాలు పేరుతో సీఎం జగన్ దగా చేశారని టీడీపీ నేత బోండా ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  జగన్ ఏడాది పాలనలో ఏ ఒక్క సామాజికవర్గం అయినా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బ్రాహ్మణ కార్పోరేషన్ల ద్వారా ఒక్కరికి కూడా సాయం అందలేదని ఆరోపించారు. తక్షణమే కోటి మంది కాపు మహిళలకు జగన్ హామీ మేరకు రూ.15వేలు సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. టీవీ-5 కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వం ఫ్యాక్షన్ మనస్తతత్వంతో పనిచేస్తోందని...మీడియాను నిలువరించేందుకు ప్రత్యేక జీవో తీసుకువచ్చారని మండిపడ్డారు. మీడియాపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని బోండా ఉమ వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి కాపు కార్పోరేషన్‌కు ఏడాదికి రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. కావాల్సిన కాంట్రాక్టర్లకు వేలకోట్లు బిల్లులు చెల్లిస్తున్నారని దుయ్యబట్టారు.


జే-ట్యాక్స్ కోసం మద్యం షాపులు తెరిచారన్నారు. రూ.30వేల కోట్ల ఆదాయం వస్తున్నా.. కాపులను ఆదుకునేందుకు చేతులు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతి కులానికి కార్పోరేషన్ ఏర్పాటు చేసి, నిధులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన జగన్.. మాట తప్పారని విమర్శించారు. నేడు పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణులు పస్తులుంటున్నారన్నారు. బీసీ కార్పోరేషన్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పోరేషన్ నుంచి ఏడాది కాలంగా ఒక్కరికి కూడా సాయం చేయలేదన్నారు. ముస్లీం మైనార్టీలకు టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చిందని... ఇప్పుడవేమీ లేవన్నారు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలను కూడా రద్దు చేశారని మండిపడ్డారు. జగన్‌కు కమిషన్లు వచ్చేవాటి కోసం నిధుల లోటు లేకుండా చూసుకుంటున్నారని...కేంద్ర నిధులను కూడా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. జగన్ చుట్టూ తిరిగే పదిమంది రెడ్లకు తప్ప అన్ని వర్గాలకు అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. ఏడాది కాలంగా రాష్ట్రానికి దరిద్రం పట్టిందని బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2020-05-09T17:23:34+05:30 IST