రాష్ట్రంలో జె ట్యాక్స్, జె బ్రాండ్‌లతో కోట్లు దోపిడీ: బోండా ఉమ

ABN , First Publish Date - 2020-05-08T17:50:44+05:30 IST

రాష్ట్రంలో జె ట్యాక్స్, జె బ్రాండ్‌లతో కోట్లు దోపిడీ: బోండా ఉమ

రాష్ట్రంలో జె ట్యాక్స్, జె బ్రాండ్‌లతో కోట్లు దోపిడీ: బోండా ఉమ

విజయవాడ: రాష్ట్రంలో జె ట్యాక్స్, జె బ్రాండ్‌లతో కోట్లు దోచుకుంటున్నారని... అందుకే దేశంలో ఎక్కడా లేని బ్రాండ్‌లు ఏపీలో మాత్రమే తయారవుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వైన్ షాపులను తెరవడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అని మండిపడ్డారు. అయిన వారి కోసం నకిలీ మద్యానికి బ్రాండ్ల ముద్ర వేస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తి స్థాయి మద్యం నిషేధిస్తామని మాట తప్పారన్నారు.  జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే.. తక్షణమే మద్యనిషేధం అమలు‌ చేయాలని డిమాండ్  చేశారు. నలభై రోజుల పాటు ప్రజలు ఇళ్లల్లో ప్రశాంతంగా ఉన్నారని... ఇప్పుడు మద్యం షాపుల వల్ల మత్తులో జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని బోండా ఉమ తెలిపారు. 


ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే.. సిగ్గు లేకుండా వైసిపి నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువులు, బియ్యం అందించలేకపోయారు గానీ జె బ్రాండ్ మద్యం మాత్రం లేదనకుండా అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లు పెంచడం ద్వారా మద్యం తాగేవారి సంఖ్య ఎలా తగ్గుతుందని ఆయన నిలదీశారు. టీడీపీ సేవా కార్యక్రమాలు చేస్తుంటే.. భౌతిక దూరం పాటించలేదని  కేసులు పెట్టారని..మరి మద్యం షాపుల వద్ద వందల మంది క్యూలు కడితే మౌనంగా చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల పోలీసులు, వైద్యుల శ్రమ అంతా వృధా అయ్యిందన్నారు. ముందు ముందు కరోనా  పాజిటీవ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల క్షేమం దృష్ట్యా మద్యం షాపులు మూసి వేయాలని బోండా ఉమ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-05-08T17:50:44+05:30 IST