రేపటి నుంచి అన్ని దేవాలయాల్లో పూజలు: బోండా ఉమా

ABN , First Publish Date - 2020-09-12T19:11:19+05:30 IST

హిందూత్వంపై వైకాపా దాడులకు నిరసనగా రేపటి నుంచి వారం రోజుల పాటు అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి బోండా ఉమా తెలిపారు.

రేపటి నుంచి అన్ని దేవాలయాల్లో పూజలు: బోండా ఉమా

అమరావతి: హిందూత్వంపై వైకాపా దాడులకు నిరసనగా రేపటి నుంచి వారం రోజుల పాటు అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి బోండా ఉమా తెలిపారు. రేపు(13వ తేదీ) సూర్య దేవాలయాల్లో పూజలు పెద్ద ఎత్తున చేయనున్నట్లు చెప్పారు. సోమవారం శివాలయాలు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్పస్వామి, గురువారం సాయిబాబా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తామని అన్నారు. శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో, శనివారం  వైష్ణవాలయాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున పూజలు చేయనున్నట్లు బోండా ఉమా పేర్కొన్నారు. 


ముఖ్యమంత్రికి హిందూమతం పట్ల గౌరవం లేకపోవటం, వైకాపా ఒక మతానికే మద్దతు తెలపటం వల్లే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వరుస దాడులపై సీబీఐ విచారణ జరగకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెంకన్న నగలు, గుప్త నిధులు, పింక్ డైమండ్ టీడీపీ వాళ్లు కొట్టేశారన్న ఆరోపణలపైనా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. రెండు నెలల్లోనే విచారణ పూర్తి చేయించి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలన్నారు. దేవుళ్లను కూడా వైకాపా రాజకీయాలకు వాడుకుని అధికారంలోకి వచ్చారని బోండా ఉమ మండిపడ్డారు. రానున్న రోజుల్లో గుళ్లలో విగ్రహాలను చోరీ చేసి అక్కడే మతమార్పిడులకు పాల్పడినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి 15నెలలైనా ఇంకా ప్రతిపక్షం మాదిరే వ్యవహరిస్తున్నారని బోండా ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-09-12T19:11:19+05:30 IST