ఏమిటీ ఘోరాలు?

ABN , First Publish Date - 2020-12-25T09:27:25+05:30 IST

‘రాష్ట్రంలో ఏమిటీ ఘోరాలు? ఆడబిడ్డలను బతకనివ్వరా? ఇంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపి తగలబెడుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా’

ఏమిటీ ఘోరాలు?

రాష్ట్రంలో ఆడబిడ్డలను బతకనివ్వరా?.. వేడుకున్నా పోలీసులు పట్టించుకోరా?

ఇక ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా?.. దిశ చట్టం ఎటు పోయింది?

ఓదార్పు యాత్ర చేసిన జగన్‌ ఇప్పుడు ఒక్కరినైనా పరామర్శించారా? 

ధర్మవరం వెళ్లడానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు దొరకలేదా?

ఆ ఘటనపై దృష్టి మళ్లించడానికే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై దాడులు

డీజీపీకి ఓ బినామీని పెట్టారు.. తల్లిదండ్రులు, ప్రజలు రోడ్డెక్కాలి

ధర్మవరం సహా అన్ని ఘటనలపైనా సీబీఐ దర్యాప్తు.. చంద్రబాబు డిమాండ్‌

స్నేహలత కుటుంబానికి 2 లక్షల సాయం

తిరగబడితేనే రౌడీలు తోక ముడుస్తారు: చంద్రబాబు పిలుపు


దిశ చట్టం గురించి అసెంబ్లీలో బారు బారు ఉపన్యాసాలు చెప్పారు. ఉరి శిక్షలు వేసేస్తామని చిటికెలు వేశారు. ఏదైనా జరిగితే గన్‌ కంటే ముందు జగన్‌ వస్తాడని ప్రగల్భాలు పలికారు. ఆ చట్టం, ఉరి శిక్షలు ఏమయ్యాయి? గన్‌ కంటే ముందు వస్తాడన్న జగన్‌ ఏమయ్యాడు? 

చంద్రబాబు


అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఏమిటీ ఘోరాలు? ఆడబిడ్డలను బతకనివ్వరా? ఇంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపి తగలబెడుతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా’ అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వారానికి రెండు మూడు జరుగుతుంటే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ఏం చేసి కాపాడుకోవాలని ప్రశ్నించారు. ‘తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చుని ఏం పీకుతున్నారు? గడ్డి పీకుతున్నారా? పోలీసు వ్యవస్థను మీ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం తప్ప ప్రజల మాన ప్రాణాలను కాపాడే బాధ్యత లేదా’ అని సీఎం జగన్‌పై మండిపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే దళిత యువతిని హత్యచేసిన ఘటనపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు ఉదయం స్నేహలత తల్లితో తాను మాట్లాడానని, ఆమె చెప్పిన విషయాలు వింటే మనసు చలించిపోయిందని వ్యాఖ్యానించారు. ‘జులాయిలు తన కూతురి వెంటపడి వేధిస్తున్నారని అనేకసార్లు ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దిశ పోలీసు స్టేషన్‌కు ఫోన్‌ చేసి తన కూతురుకు ఏదో అయిందని భయంగా ఉందని చెబితే.. వచ్చి ఫిర్యాదు ఇస్తే విచారిస్తామని తీరిగ్గా చెప్పారు. పోలీసులు వెంటనే స్పందిస్తే తన కూతురు బతికేదేమోనని ఆ తల్లి రోదిస్తుంటే సమాధానం చెప్పేవాళ్లు ఎవరు? ఒక్క అనంతపురం జిల్లాలోనే ఇటీవల మూడు ఘటనలు జరిగాయి.


ఇంట్లో పడుకున్న ఒక యువతిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఒక బాలికను అత్యాచారం చేసిన ఘటనలో పట్టుకొన్న లారీ డ్రైవర్‌ను  వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ సిఫారసుతో పోలీసులు వదిలేస్తే.. ఆ ఊరి జనమంతా వచ్చి నల్లమడ పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. గుంటూరు జిల్లాలో వికలాంగ యువతిని తగలబెట్టి చంపారు. రాజమండ్రిలో ఒక దళిత బాలికను 12 మంది కలిసి గ్యాంగ్‌ రేప్‌ చేసి పోలీసు స్టేషన్‌ ముందు వదిలి వెళ్తే.. తనకు ఏమీ జరగలేదని చెప్పాలని ఆ బాలికను పోలీసులు ఒత్తిడి చేశారు. ఆ రోజే ఆ నిందితులను వెంటాడి ఉరి శిక్షల వరకూ తీసుకెళ్తే రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరిగేవే కావు.


ఈ ముఖ్యమంత్రి ఒక్క బాధితురాలినైనా పరామర్శించారా? ఓదార్పు యాత్ర పేరుతో రెండేళ్లపాటు ఇంటింటికీ వెళ్లి పరామర్శించిన పెద్ద మనిషికి ఇప్పుడంత తీరిక లేదా? పులివెందులలో ఉన్న ఆయనకు ధర్మవరం వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు దొరకలేదా’ అని ధ్వజమెత్తారు. ధర్మవరం ఘటనపై నుంచి మీడియా, ప్రజల దృష్టిని మళ్లించడానికే తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే దాడికి వెళ్లారని ఆరోపించారు. స్నేహలత కుటుంబానికి తమ వంతు సాయంగా టీడీపీ తరఫున రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ‘ఈ 19 నెలల్లో మహిళలపై జరిగినన్ని అత్యాచారాలు, దాడులు, సజీవ దహనాలు ఉమ్మడి రాష్ట్రంలో గానీ, నవ్యాంధ్రలో గానీ ఏనాడూ జరగలేదు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను అత్యాచారం చేసి చంపితే చర్యలు లేవు. ఇంకా ఏం జరిగితే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది? చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? ఇదే మాట కోర్టులు చెబితే వాటిపైనా దాడులకు దిగుతున్నారు. వీటికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? ఆయన ఏమీ చేయలేరు. ఒక బినామీ పోలీసు శాఖను నడిపిస్తున్నారు. వైఎస్‌ వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించినప్పుడే వీరెంత కిరాతకులో అర్థమైంది’ అని అన్నారు.


కలిసి ఎదిరిద్దాం..

‘రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై మహిళలు, ఆడబిడ్డలు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి నిరసన తెలపాలి. తిరగబడితేనే రౌడీలు తోకముడుస్తారు. అందరం కలిసి ఈ దుర్మార్గాలను ఎదిరిద్దాం. స్నేహలత హత్యతోపాటు రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకున్న అఘాయిత్యాలపై సీబీఐ విచారణ జరపాలి. ఈ కేసుల్లో పోలీసులు వ్యవహరించిన తీరు... అధికార పార్టీ నేతల జోక్యంపై కూడా ఈ విచారణ జరగాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.


రాష్ట్రంలో పరిస్థితులు దిగజారడానికి సగం కారణం పోలీసులే. పోస్టింగుల కోసం ఎంతకైనా వారు రాజీ పడటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.

ఒక బినామీ పోలీసు శాఖను నడిపిస్తున్నారు. ఆ బినామీ చెప్పినట్లే అన్నీ జరుగుతాయి. ఇవన్నీ అడిగినందుకు రేపు ఎవరినో పట్టి నన్ను బూతులు తిట్టిస్తారు.       

చంద్రబాబు

Updated Date - 2020-12-25T09:27:25+05:30 IST