హక్కుల అణచివేత ఆపండి!

ABN , First Publish Date - 2020-12-19T07:15:31+05:30 IST

రాష్ట్రంలో శాంతి భధ్రతలు కాపాడటానికి బదులు, ప్రజల ప్రాథమిక హక్కులు అణిచివేసేందుకు పోలీసులు శ్రద్ధ చూపడం

హక్కుల అణచివేత ఆపండి!

వైసీపీకి వత్తాసు పలకడం మానండి 

శాంతి భధ్రతలపై దృష్టి సారించండి

డీజీపీ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ


అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతి భధ్రతలు కాపాడటానికి బదులు, ప్రజల ప్రాథమిక హక్కులు అణిచివేసేందుకు పోలీసులు శ్రద్ధ చూపడం విడ్డూరంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జగన్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై అసంతృప్తిని వెలిబుచ్చేవారిని అణిచివేయడానికి బదులు శాంతి భద్రతలపై దృష్టి సారించాలని డీజీపీకి సూచించారు. అమరావతి ఆందోళనకు ఏడాది అయిన సందర్భంగా గురువారం అమరావతి పరిరక్షణ సమితి సభ నిర్వహించింది. దీనికి మద్దతు పలికిన టీడీపీ నేతలు 600 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావొద్దని, అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవద్దని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. దీనిపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు శుక్రవారం లేఖ రాశారు. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచమని, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వమే అణిచివేతకు పాల్పడటం దారుణమన్నారు.  ‘‘రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించడం పోలీసుల విధి. అణిచివేత మాని శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలి’’అని చంద్రబాబు కోరారు. 

Updated Date - 2020-12-19T07:15:31+05:30 IST