సంక్రాంతే డెడ్‌లైన్‌!

ABN , First Publish Date - 2020-10-28T08:39:05+05:30 IST

టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు స్వాధీనం చేయడానికి సంక్రాంతే డెడ్‌లైన్‌ అని జగన్‌ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి,

సంక్రాంతే డెడ్‌లైన్‌!

కట్టిన ఇళ్లన్నీ ఆలోపు పేదలకివ్వాలి

లేకపోతే వారితోనే గృహప్రవేశాలు చేయిస్తాం

జగన్‌ ప్రభుత్వానికి చంద్రబాబు హెచ్చరిక


అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు స్వాధీనం చేయడానికి సంక్రాంతే డెడ్‌లైన్‌ అని జగన్‌ ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గడువు విధించారు. ఆలోపు ఆ ఇళ్లను స్వాధీనం చేయని పక్షంలో.. వాటి కోసం డిపాజిట్లు కట్టిన పేదలతో తామే వాటిలో గృహప్రవేశం చేయిస్తామని ప్రకటించారు. మంగళవారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పేదల నుంచి డిపాజిట్లు తీసుకుని ఏడాదిన్నరగా ఇళ్లను స్వాఽధీనం చేయకుండా వైసీపీ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని, ప్రభుత్వం కదలకపోతే వాటిపై ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తారని ఆయన ప్రశ్నించారు. ‘ఇళ్ల స్థలాల కోసం జరిపిన భూ సేకరణలో వైసీపీ బాధితులు కోర్టుకు వెళ్లారు. వారికి సమాధానం చెప్పలేక టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీని ఆడిపోసుకుంటున్నారు’ అని ఆయన విమర్శించారు.


‘దేశంలో ఇతర జాతీయ ప్రాజెక్టుల నిర్మాణం దశాబ్దాల తరబడి నత్తనడక నడుస్తున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు తీయించాం. ఆ ఊపును కొనసాగించడం చేతగాక వైసీపీ దుష్ప్రచారానికి దిగుతోంది. అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లని అనుకున్నాం. ఆ రెండు కళ్లనూ జగన్‌రెడ్డి పొడిచేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు’ అన్నారు. ఇంకా ఏమన్నారంటే..


ఘనకార్యం చేసినట్లు ప్రకటనలా? 

‘రైతులను ఇంత దగా చేసిన ప్రభుత్వం మరొకటి లేదు. ఒక్కో రైతుకు రూ.77 వేలు ఎగ్గొట్టారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లకు కలిపి ఒక్కో రైతుకు ఇచ్చేది రూ.37 వేలు మాత్రమే. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే అన్నదాత సుఖీభవ,  రైతు రుణ మాఫీ కింద ఒక్కో రైతుకు రూ.1.15 లక్షలు వచ్చేవి.  పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి జగన్‌రెడ్డి తన సొంత పేపర్‌లో రంగుల ప్రకటనలకు కోట్ల రూపాయల ప్రజా ధనం గుమ్మరిస్తున్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన పేదలకు గతంలో ఆపద్భంధు పథకం కింద కేవలం రూ.50 వేలు మాత్రమే వచ్చేవి. టీడీపీ ప్రభుత్వం కొత్త బీమా పథకం తెచ్చి రూ.5 లక్షలు అందే ఏర్పాటు చేసింది. జగన్‌ సర్కారు ఏడాదిన్నరపాటు దానిని నిలిపివేసి ఇప్పుడు అనేక కుదింపులతో కొత్త పేరుతో అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంటలు పడి ప్రయాణం చేసేవారి నడుములు విరుగుతుంటే అది చాలలేదన్నట్లుగా ప్రభుత్వం వసూళ్ల దాడి మొదలు పెట్టింది. రోడ్లు బాగు చేసే దిక్కులేకపోయినా కొత్తగా 11 టోల్‌ గేట్లు పెట్టి పన్నులు వసూలు చేయాలనుకుంటున్నారు. హారన్‌ కొడితే జరిమానా విధిస్తామనడం తుగ్లక్‌ చర్య. కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు, పెట్రో ధరలు, భారీగా పెంచేశారు. జె ట్యాక్స్‌, వైసీపీ ట్యాక్స్‌, లోకల్‌ ట్యాక్స్‌ దీనికి అదనం.’


అబద్ధాలకు పోలవరం బలి..

వైసీపీ అబద్ధాల ప్రచారానికి పోలవరం బలైందని టీడీఎల్పీ ఉప నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఏడేళ్లనాటి అంచనాల ప్రకారం నిధులు ఇస్తామని కేంద్రం చెబుతుంటే వైసీపీ చోద్యం చూస్తోందని ఆక్షేపించారు. రాష్ట్రంలో 83 శాతం మంది ప్రజలు ఒకే రాజధానికి అనుకూలంగా ఉన్నారని ఒక పత్రిక నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో వెల్లడైందని విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జగదీశ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-28T08:39:05+05:30 IST