ప్రశ్నిస్తే వేధింపులు

ABN , First Publish Date - 2020-10-07T09:49:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన టీడీపీ నేతలను ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు

ప్రశ్నిస్తే వేధింపులు

కూల్చివేతలు, ఆస్తుల ధ్వంసాలు..

ఏళ్ల నాటి కేసులు తవ్వి అరెస్టులు, వేధింపులు

ఊరేగింపులు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను ఏమీ అనలేదు

కరోనా నిబంధనల పేరుతో జవహర్‌పై కేసా?

చిరు వ్యాపారులకు న్యాయం కోరితే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారా?

ఇంత దుర్మార్గ ప్రభుత్వాన్ని చరిత్రలో చూడలేదు

 నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌


అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన టీడీపీ నేతలను ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ప్రహరీ గోడను కూల్చేశారని, విజయవాడలో తమ పార్టీ నేత పట్టాభి కారు ధ్వంసం చేశారని, గురజాలలో టీడీపీ నాయకుడు శ్రీనివాసరావుకు చెందిన మూడున్నర ఎకరాల బొప్పాయి తోటను నరికివేశారని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘18 ఏళ్ల కిందటి అంశాన్ని తవ్వి కడపలో పార్టీ నేత హరిప్రసాద్‌ను అరెస్టు చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డిని వేధిస్తున్నారు. పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు. రోడ్లపై డాన్సులు, ఊరేగింపులు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులను ఏమీ అనకుండా కరోనా నిబంధనల పేరుతో మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌పై కేసు పెట్టడం హేయం. కాకినాడ పార్టీ అధ్యక్షుడు నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం’ అని విమర్శించారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని, పార్టీని చరిత్రలో చూడలేదన్నారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై అందరూ ఆగ్రహిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ‘న్యాయస్థానాలు తప్పుబడుతున్నాయి.


పోలీసులపై నమోదవుతున్న కేసుల గురించి కేంద్ర సంస్థ ఎన్‌సీఆర్‌బీ చెప్పింది. సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసు కార్యాలయం ఎదుటే ముస్లిం మైనారిటీ వ్యక్తి షేక్‌ సత్తార్‌ ఆత్మహత్య ప్రయత్నం చేయాల్సి రావడం దారుణం. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి’ అని తెలపారు. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రంలో 3.2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయని, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని.. దెబ్బ తిన్న ఇళ్లకు మరమ్మతులు చేయించలేదని, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చేతి వృత్తుల వారినీ ఆదుకోలేదని విమర్శించారు. మంత్రి జయరాం బెంజి కారు కుంభకోణం మాదిరిగా మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని సాక్షాలతో బయటపెట్టడానికి పార్టీనేతలు కృషి చేయాలని కోరారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయాలన్నారు. వైసీపీ రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు. రాష్ట్రంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) బదులు వైసీపీ కోడ్‌ అమలవుతోందని టీడీపీ మైనారిటీ నేత నాగుల్‌ మీరా విమర్శించారు. రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన షేక్‌ సత్తార్‌ ప్రాణాలకు ముప్పు వాటిల్లితే సహించబోమని, రాష్ట్రంలో మైనారిటీలంతా కలిసి చలో బొమ్మూరు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Read more