అప్పుల కోసం రైతుల బతుకు తాకట్టు!

ABN , First Publish Date - 2020-09-05T08:50:35+05:30 IST

అప్పుల కోసం రైతుల బతుకులను తాకట్టు పెట్టడానికి జగన్‌ ప్రభుత్వం సిద్ధమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

అప్పుల కోసం రైతుల బతుకు తాకట్టు!

ఉచిత విద్యుత్‌ను కాలరాశారు.. జగన్‌కు ఓటేసిన ప్రజల్లో బాధ

బిహార్‌ కంటే దారుణంగా మార్చారు: చంద్రబాబు


అమరావతి, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): అప్పుల కోసం రైతుల బతుకులను తాకట్టు పెట్టడానికి జగన్‌ ప్రభుత్వం సిద్ధమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఎన్నో పోరాటాల తర్వాత మీటర్లు లేని ఉచిత విద్యుత్‌ రైతులకు అందుతోందని.. దానిని ఇప్పుడు కాలరాసి మీటర్లను పెట్టాలని చూడడం దుర్మార్గ చర్యని మంండిపడ్డారు. శుక్రవారం ఆయన అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో ఆన్‌లైన్‌ సమావేశంలో మాట్లాడారు. ఇంత వేగంగా అప్రతిష్ఠకు గురైన ప్రభుత్వం మరొకటి లేదని, జగన్‌కు ఎందుకు ఓటేశామా అని ప్రజలు బాధపడే పరిస్ధితులు వచ్చాయని అన్నారు. ‘అమూల్య సంపద కలిగిన రాష్ట్రాన్ని బిహార్‌ కంటే దారుణంగా తయారు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఏడాదికి లక్ష కోట్ల ఆదాయం సంపాదించే శక్తి ఉన్న అమరావతిని చంపేసి ఏడాదిలో లక్ష కోట్ల అప్పులు తెచ్చారు. లంచాల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు.


అవినీతి లేకుండా ఏ పథకం అమలు కావడం లేదు. పేదల ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలును పెద్ద కుంభకోణంగా మార్చారు. ఈ దుర్మార్గాలపై ప్రతిపక్షంగా మనం బలంగా పోరాడాలి. ప్రజల్లోకి ఈ విషయాలను తీసుకెళ్లాలి’ అని పిలుపిచ్చారు. అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగంగా చేయడంతోపాటు డ్రిప్‌ ఇరిగేషన్‌, మైక్రో ఇరిగేషన్‌ను బాగా ప్రోత్సహించామని, పెద్ద పరిశ్రమలు తెచ్చి జిల్లాలో పారిశ్రామిక వాతావరణం కల్పించామని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఆ పనులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వ్యవసాయం అన్నీ నాశనం చేశారని, నిన్నటికి నిన్న కియా ప్లాంట్‌ వద్ద పెట్రోల్‌ బంక్‌ పెట్టి యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారని.. దుర్మార్గాలు, దౌర్జన్యాలు రోజువారీ కార్యకలాపాలుగా మారిపోయాయని దుయ్యబట్టారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 50 వేల కరోనా కేసులు వచ్చాయని, ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ‘పార్టీ కార్యకర్తలకు ఎవరికి సమస్య వచ్చినా నేతలు అండగా నిలవాలి. ఈ విషయంలో పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది’ అని టీడీపీ నేతలకు చెప్పారు. అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతడి కుటుంబానికి పార్టీ అండగా నిలిచిందని.. అతడి కుమార్తెను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ చదివించిందని.. ఆమె ఇప్పుడు సివిల్స్‌లో 190వ ర్యాంక్‌ సాధించిందని.. ఇలాంటివి మనకు గర్వ కారణమని పేర్కొన్నారు. 


దళితులపై సాగుతున్న దమనకాండ..

వైసీపీ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. దళిత యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని వైసీపీకి చెందిన వ్యక్తి నమ్మించి మోసం చేశారని.. పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో కృష్ణా జిల్లా ముదినేపల్లిలోని మచ్చా ధనలక్ష్మి ఇంటిని తగులబెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయిందని ట్విటర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-05T08:50:35+05:30 IST