ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీలో కరోనా విజృంభణ: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-09-03T22:02:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీలో కరోనా విజృంభించిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనా

ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీలో కరోనా విజృంభణ: చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీలో కరోనా విజృంభించిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్య నిపుణులతో చంద్రబాబు ఆన్‌లైన్లో సమావేశం అయ్యారు. కరోనా వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక, ఇతరత్రా అనేక సమస్యలు తలెత్తున్నాయని చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఎప్పటికప్పుడు తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సంక్షోభం ఎప్పుడు వచ్చినా ఆదుకునేందుకు టీడీపీ ముందుంటుందని పేర్కొన్నారు. సంక్షోభాన్ని నివారించకపోతే పెను ప్రమాదానికి దారితీస్తుందన్నారు. కరోనా వల్ల దెబ్బతిన్న అన్ని రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రతి పేద కుటుంబానికి రు.10 వేలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్ కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 10 వేలకు మందికి పైగా కేసులు నమోదవుతున్నాయన్నారు. ఏపీలో అన్ని జిల్లాలు కరోనా బారిన పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం కరోనాను నియంత్రణ చేయలేక చేతులెత్తేసిందని ఆరోపించారు. వనరుల వినియోగంపై దృష్టి లేదని ధ్వజమెత్తారు. పద్ధతి ప్రకారం చేస్తేనే కరోనాను నియంత్రించగలమని హితవు పలికారు. కరోనా నివారణకు 20 లక్షల వరకు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం మొదటి నుంచి కరోనాను తేలిగ్గా తీసుకోవటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు. కరోనాపై అవగాహన పెంచేందుకు ఓ వీడియోను చంద్రబాబు విడుదల చేశారు.

Updated Date - 2020-09-03T22:02:37+05:30 IST