పట్టాలకు కాదు.. అవినీతికే అడ్డు

ABN , First Publish Date - 2020-07-08T08:14:38+05:30 IST

వైసీపీ నేతల అవినీతికి అడ్డుపడుతున్నాం తప్ప.. పేదలకు ఇళ్ల పట్టాలివ్వడానికి కాదని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు.

పట్టాలకు కాదు.. అవినీతికే అడ్డు

  • చేసేది తప్పుడు పనులు... చెప్పేవి మాయ మాటలు
  • భూసేకరణ, మెరక, పట్టాలివ్వడంలో అవినీతి.. ప్రతి స్కీమునూ స్కాంగా మారుస్తున్నారు
  • వైసీపీ నేతలు జేబులు నింపుకొంటున్నారు.. వైఎస్‌ హయాంలో 14 లక్షల ఇళ్లు మాయం
  • కట్టకుండానే 5 వేల కోట్లు స్వాహా.. మా హయాంలో స్కాం లేకుండా 10 లక్షల ఇళ్లు 
  • వాటిని లబ్ధిదారులకు ఎందుకివ్వడం లేదు?.. మేం 3 సెంట్లు ఇస్తే ఇప్పుడు సెంటా? 
  • వైసీపీ 4.5 లక్షల ఇళ్లు రద్దు చేసింది.. కొత్తగా కట్టకపోగా కట్టినవీ కూల్చేస్తారా?: బాబు
  • చేసేది తప్పుడు పనులు...  చెప్పేవి మాయ మాటలు: చంద్రబాబు

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేతల అవినీతికి అడ్డుపడుతున్నాం తప్ప.. పేదలకు ఇళ్ల పట్టాలివ్వడానికి కాదని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. ఇళ్ల పట్టాలను టీడీపీ అడ్డుకుంటోందన్న వైసీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అధికార పక్ష నేతలు తమ జేబులు నింపుకోవడానికి ప్రతి స్కీమును స్కాముగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. కుప్పంలో టీడీపీ హయాంలో దళితులకు మంజూరైన ఇళ్లను అధికారులు కూల్చివేసినందుకు నిరసనగా అక్కడి ఎమ్మార్వో కార్యాలయం ముందు మంగళవారం ధర్నా జరిగింది. దానిని ఉద్దేశించి చంద్రబాబు ఇక్కడి తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గృహ నిర్మాణంలో భారీ దోపిడీ చేశారు. టీడీపీ హయాంలో అటువంటి స్కాంలకు తావు లేకుండా ఇళ్లు కట్టాం. ఐదేళ్లలో పది లక్షల ఇళ్లు పూర్తి చేశాం. వైసీపీ అధికారంలోకి రావడంతోనే 4.5 లక్షల ఇళ్లు రద్దు చేశారు. మా హయాంలో పేదలకు రెండున్నర నుంచి మూడు సెంట్ల ఇంటి స్థలం ఇస్తే ఇప్పుడు దానిని ఒక్క సెంటుకు తగ్గించారు’ అని విమర్శించారు. 


అసలెందుకు కూల్చుతున్నారు?

ఏ ప్రభుత్వం ఉన్నా పేదలు పేదలేనని.. టీడీపీ హయాంలో నిర్మాణం మొదలుపెట్టుకున్న వారి ఇళ్లు ఎందుకు కూల్చివేస్తున్నారో జవాబు చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘లబ్ధిదారు వాటాతో కలిపి రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని గత ప్రభుత్వం వారికిచ్చిన మంజూరు పత్రంలో పేర్కొంది. ఒక హక్కుగా ప్రభుత్వం నుంచి పేదలకు సంక్రమించిన ఇల్లు కూల్చేసే హక్కు.. ఇచ్చిన పట్టా రద్దు చేసే హక్కు వీళ్లకు లేదు. రెండో ఏడాదిలోకి వచ్చారు. ఒక్క ఇల్లయినా కట్టారా? కొత్తగా కట్టకపోగా గత ప్రభుత్వం కట్టిన ఇళ్లు కూల్చేయడం ప్రజాద్రోహం. జనం కరోనా కష్టాల్లో ఉంటే వారి ఇళ్లను కూల్చేస్తారా? కూల్చిన పాతిక మంది దళితుల ఇళ్లను మళ్లీ పునాదుల నుంచి నిర్మించాలి. వాళ్లకు ఇంటి జాగా ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమిలో ఇళ్లు కట్టుకుంటే ఎలా కూలుస్తారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. అర్హులకు మళ్లీ అక్కడే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.


ఇళ్లు చూసేందుకు వెళ్తే అరెస్టులా?

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో సహా పలువురు టీడీపీ నేతల అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా కట్టిన ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో చూసేందుకు వెళ్లిన తమ నేతలను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. ‘ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, 13 నెలలైనా పేదలకు స్వాధీనం చేయకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా? టీడీపీ నేతలు వాటిని చూడడానికి వెళ్లడం నేరమా? బండారును రాత్రి 7.30 గంటల దాకా పోలీసు స్టేషన్‌లో అక్రమంగా నిర్భంధిస్తారా’ అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన టీడీపీ నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని మంగళవారం రాత్రి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వం కట్టిన ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలని.. గృహ నిర్మాణ శాఖలో పెండింగ్‌ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.


‘భూ సేకరణలో స్కాం, మెరక చేయడంలో స్కాం, పట్టాలివ్వడంలో స్కాం.. పేదల ఇళ్లలో కూడా వైసీపీ కక్కుర్తికి పాల్పడుతోంది.’

‘పేదల ఇళ్ల పట్టాలకు మేం అడ్డుపడడం లేదు. ఆ ముసుగులో వైసీపీ నేతలు చేస్తున్న అవినీతికి మాత్రమే మేం అడ్డుపడుతున్నాం.’

రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 14 లక్షల ఇళ్లు మాయం చేశారు. కట్టకుండానే కట్టినట్లుగా బిల్లులు చేసుకుని ఈ 13 జిల్లాల్లోనే రూ.ఐదు వేల కోట్ల స్కాంకు పాల్పడ్డారు.’

‘కొత్తవి కట్టకపోగా గత ప్రభుత్వం కట్టిన ఇళ్లు కూల్చేయడం ప్రజాద్రోహం. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే వారి ఇళ్లను కూల్చడం కంటే నీచం మరొకటి లేదు.’


స్మృతివనమూ ముక్కలా?

అంబేడ్కర్‌ స్మృతివనాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుసుకున్న రైతులు, దళిత నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. శాఖమూరులోని స్మృతి వనం వద్ద నిరసన చేపట్టారు. 7 ఎకరాల్లో అంబేడ్కర్‌ ఉద్యానవనం నిర్మించాలను కోవడం దళితుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. గత ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. వైసీపీ సర్కారు దీనిని కూడా రాజధాని మాదిరిగా..  మూడు ముక్కలు చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ‘స్మృతి వనం.. గుంటూరు మానససరోవరం’ అంటూ, తాజాగా విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌లో నిర్మిస్తామని చెప్పడం ఏమిటని నిలదీశారు. ఇదిలావుంటే, అంబేడ్కర్‌ విగ్రహాన్ని విజయవాడలో వివాదంలో ఉన్న స్ధలంలో ఎలా ఏర్పాటు చేస్తారని టీడీపీ దళిత నాయకులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-08T08:14:38+05:30 IST