కడప జిల్లాలో టీడీపీ బీసీ నేత దారుణ హత్య
ABN , First Publish Date - 2020-12-30T07:49:45+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ అధికార ప్రతినిధి, బీసీ నేత నందం సుబ్యయ్య (41) దారుణ హత్యకు గురయ్యారు.
- ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతిపై
- పట్టణ కమిషనర్‌కు ఫిర్యాదు
- కాసేపటికే కళ్లలో కారం చల్లి
- చంపిన వైసీపీకి చెందిన ప్రత్యర్థులు
- ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అక్రమాలపై
- సోషల్ మీడియాలో సుబ్బయ్య పోస్టులు
కడప, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీ అధికార ప్రతినిధి, బీసీ నేత నందం సుబ్యయ్య (41) దారుణ హత్యకు గురయ్యారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఇంటి పట్టాల పంపిణీలో అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ రాధకు ఆయన ఫిర్యాదు చేశారని, కాసేపటికే తన భర్త కళ్లలో ప్రత్యర్థి వైసీపీ వర్గీయులు కారం చల్లి.. ఆపై రాడ్డుతో తలపై మోది దారుణంగా హతమార్చారని మృతుడి భార్య అపరాజిత ఆరోపించారు. పట్టణ శివారు రామేశ్వరం సమీపంలో పట్టణ పేదలకు పట్టాల పంపిణీ కోసం 12 ఎకరాలు కేటాయించారు. 6,400 మందికి మంగళవారం పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఓ వ్యక్తి సుబ్బయ్య ఇంటికొచ్చారు. పట్టా ఇవ్వకుండా తనకు అన్యాయం చేస్తున్నారని చెప్పడంతో ఆ విషయం మాట్లేందుకు ఆయన వెళ్లారు. పట్టాల పంపిణీ స్థలంలో కమిషనర్ రాధ, రెవిన్యూ, ఇతర అధికారులు పూజలు చేస్తున్నారు.
పట్టాల మంజూరులో పేదలకు అన్యాయం జరుగుతోందని, అందరికీ న్యాయం చేయాలని కమిషనర్‌ను సుబ్బయ్య కోరగా.. పూజలయ్యాక మాట్లాడతానని కమిషనర్ చెప్పారు. పూజలు చేసే ప్రదేశానికి 10-20 అడుగుల దూరం వెళ్లిన సుబ్బయ్య ప్లాట్లు కనిపించేలా సెల్‌ఫోన్లో సెల్ఫీ తీసుకుని.. కడప జిల్లా వార్తలు అనే వాట్సాప్ గ్రూపులో 9.40 గంటలకు పోస్టు చేసి.. శుభోదయం అని పెట్టారు. అలా మెసేజ్ పెట్టిన 15 నిమిషాల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కళ్లలో కారం చల్లి.. తలపై ఇనుప రాడ్లతో దాడి చేసి అతి కిరాతంగా హతమార్చారు. ఈ సంఘటనతో అధికారులు పూజలు మధ్యలోనే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. మృతుడి భార్య అపరాజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నలుగురు అనుమానితులను గుర్తించామని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. కాగా.. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అతని బావమరిది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా సుబ్బయ్య ఆరోపణలు చేస్తున్నట్లు తెలిసింది.
ఐదు రోజుల క్రితం తిరుమల వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్టు చేశారని, రెండు రోజుల కింద ఇసుక అక్రమాలపై మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు గురి కావడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి సుబ్బయ్య రాచమల్లుకు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. 2014 స్థానిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎంపీపీ సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారు. ఇటీవలే టీడీపీ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు.
అపరాజితకు చంద్రబాబు ఓదార్పు
టీడీపీ నేత సుబ్బయ్య దారుణ హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు హతుడి భార్య అపరాజితతో మాట్లాడారు. ‘సార్..! నా భర్తను హత్య చేసి నాకు, నా కుటుంబానికి తీరని అన్యాయం చేశారు. 4, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు..’ అని ఆమె కన్నీరు మున్నీరైంది. ‘అమ్మా..! నీవు ధైర్యంగా ఉండాలి.. మీకు, మీ పిల్లలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. నిందితులను వదిలే ప్రసక్తే లేదు’ అని ఆయన భరోసా ఇచ్చారు. కాగా.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, కాల్వ శ్రీనివాసులు బుధవారం ప్రొద్దుటూరు రానున్నారు. సుబ్బయ్య అంత్యక్రియల్లో పాల్గొంటారు.
ఇంకెంత మంది బలికావాలి: టీడీపీ
అమరావతి: ఈ పాలనలో ఇంకెన్ని దారుణాలు చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక హత్యలు చేసే నైజం వైసీపీ నేతలదని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. అలాగే, శ్రీశైలం దేవస్థానంలో భక్తుడి మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
అక్రమాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: సీపీఐ
ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే హత్యలకు పాల్పడటం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. అక్రమాలపై వైసీపీ నేతల హ స్తాన్ని ప్రశ్నించినందునే సుబ్బయ్యను హత్య చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.