పార్టీరహితం అబద్ధం

ABN , First Publish Date - 2020-05-29T08:59:12+05:30 IST

పార్టీరహితంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్న సీఎం జగన్‌ ప్రకటనలు పచ్చి అబద్ధమని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు చెప్పారు.

పార్టీరహితం అబద్ధం

  • మీకు నచ్చిన పంచాయతీని ఎంపిక చేయండి
  • పథకాలు ఎవరికిస్తున్నారో పరిశీలిద్దాం
  • నిరూపించకుంటే రాజకీయాలకు గుడ్‌బై
  • ముఖ్యమంత్రికి అచ్చెన్నాయుడు సవాల్‌


అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): పార్టీరహితంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామన్న సీఎం జగన్‌ ప్రకటనలు పచ్చి అబద్ధమని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు చెప్పారు. ‘మీకు నచ్చిన జిల్లాలో మీకు నచ్చిన గ్రామ పంచాయతీని ఎంపిక చేసి గ్రామ సభ పెట్టండి. పఽథకాలు నిజంగా పేదవారికి ఇస్తున్నారా లేక మీ పార్టీ వారికి ఇస్తున్నారా పరిశీలిద్దాం. నా మాట తప్పని రుజువైతే నేను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధం’ అని గురువారం మహానాడు వేదికపై నుంచి ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు. ‘బలిపీఠంపై బడుగుల సంక్షేమం’ అంశంపై ఆయన మాట్లాడారు. బీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులన్నీ మళ్లించి కొత్త పథకాలకు ఇస్తున్నారని ఆరోపించారు. కొత్తవాటి కింద ఇరవై శాతం కూడా అర్హులకు ఇవ్వడం లేదన్నారు. బీసీ కార్పొరేషన్‌ నుంచి ఒక్క రుణం కూడా ఏడాదికాలంలో ఇవ్వలేదని ఆరోపించారు.


బీసీ వర్గాలు ఎందుకు దూరమయ్యాయి?

పదేళ్లపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బీసీ సంక్షేమం కోసం పదివేల కోట్లు ఖర్చు పెడితే గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలోనే రూ.41 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ‘ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీల కోసం దేశంలో మొదటిసారి సబ్‌ ప్లాన్‌ తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. బాగా వెనుకబడిన కులాల వారి కోసం ఎంబీసీ కార్పొరేషన్‌ పెట్టి నిధులు కేటాయించాం. ఎంత చేసినా గత ఎన్నికల సమయంలో బీసీ వర్గాలు టీడీపీపై కొంత అపనమ్మకం ఏర్పరచుకుని దూరమయ్యాయి. ఆ పరిస్థితి ఎందుకువచ్చిందో పార్టీలోని నేతలంతా ఆత్మవిమర్శ చేసుకుని దిద్దుకోవాలి. ‘పోయిన ఎన్నికల ముందు వారు వీధుల్లోకి వచ్చి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు.


మేం మాకున్న పరిమితుల్లో ఐదుశాతం రిజర్వేషన్లు కల్పించాం. కాపు కార్పొరేషన్‌ పెట్టి అనేక మందికి రుణాలు ఇచ్చాం. విదేశీ విద్యకు సాయం చేశాం. బీసీల్లో అసంతృప్తి వస్తున్నా మీకు మాటిచ్చామని ఇవన్నీ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చి రిజర్వేషన్లు ఎత్తేసింది. మిగిలినవన్నీ నిలిపివేసింది. ఆ రోజు పోరాటాలు చేసినవారు ఇప్పుడు బయటకు వచ్చి ఎందుకు నిలదీయడం లేదో ఆలోచించండి’ అని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ దళితుల హక్కని, వాటిని కూడా జగన్‌ ప్రభుత్వం నీరుగార్చిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత ఈ సందర్భంగా విమర్శించారు. చర్చకు చంద్రబాబు సమాధానమిస్తూ.. జగన్‌ ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగినంత అన్యాయం మరెప్పుడూ జరగలేదని విమర్శించారు. ‘మనం బీసీ వర్గాల వారికి ఇచ్చిన ఛైర్మన్‌ పదవులు ఇప్పుడు అగ్రవర్ణాలకు ఇచ్చారు. బీసీలకు అమలు చేసిన పథకాలు, పెట్టిన ఖర్చుపై చర్చకు సిద్ధం’ అని సవాల్‌ విసిరారు.

Updated Date - 2020-05-29T08:59:12+05:30 IST