కలిసి మాట్లాడుకోండి!

ABN , First Publish Date - 2020-12-30T09:14:06+05:30 IST

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కలిసి కూర్చుని... మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కలిసి మాట్లాడుకోండి!

  • ఉత్తర్వులు అందిన 3 రోజుల్లోసమయం ఎస్‌ఈసీ నిర్ణయించాలి
  • ప్రభుత్వ వాదనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలి
  • ‘ఫిబ్రవరి’ ఎన్నికలపై హైకోర్టు ఆదేశం

అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కలిసి కూర్చుని... మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మౌఖికంగా  ఆదేశాలిచ్చిన ధర్మాసనం... మంగళవారం లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువరించింది. ఈ సంప్రదింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి హోదా తగ్గని అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న మూడు రోజుల్లో ఎన్నికల కమిషనర్‌ చర్చల వేదికను నిర్ణయించి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది.  వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ ప్రయత్నాలు అడ్డుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం న్యాయమూర్తి  జస్టిస్‌ ఏవీ శేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘కొవిడ్‌-19 కారణంగా మానవాళి మొత్తం అత్యంత క్లిష్టమైన, బాధాకర పరిస్థితులు ఎదుర్కొంటోందనడంలో  సందేహం లేదు. ప్రభుత్వం, ఎస్‌ఈసీ తరఫు వాదనలు... సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత ప్రయోజనాల దృష్ట్యా... ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలి.  కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలను, తన వాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి లిఖితపూర్వకంగా  అందించాలి’’ అని ఆదేశించారు.


వ్యాజ్యంలో లేవనెత్తిన అంశాలను అధికారులు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. 4 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ నిర్వహించాలని నిర్ణయించారని, అందులో ఏపీ కూడా ఒకటని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా ఎస్‌ఈసీ దృష్టికి తీసుకురావచ్చని న్యాయమూర్తి సూచించారు. ‘‘ఎన్నికల నిర్వహణ అంశం పూర్తిగా ఎస్‌ఈసీ పరిధిలోనిది. ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రమే ప్రభుత్వంతో సంప్రదించాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు సమ్మతి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది చేసిన వాదనలనూ పొందుపరిచారు.

Updated Date - 2020-12-30T09:14:06+05:30 IST