సస్పెండ్ చేస్తే ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు
ABN , First Publish Date - 2020-12-05T09:23:45+05:30 IST
‘సభాపతి స్థానం వద్దకొచ్చి అల్లరి చేయడమేంటి? వారిని సస్పెండ్ చేయడం పట్ల మథనపడుతున్నాను. సస్పెండ్ చేసిన రోజు ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

సభాపతి స్థానం దగ్గరకొచ్చి అల్లరి చేస్తారా?: స్పీకర్
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘సభాపతి స్థానం వద్దకొచ్చి అల్లరి చేయడమేంటి? వారిని సస్పెండ్ చేయడం పట్ల మథనపడుతున్నాను. సస్పెండ్ చేసిన రోజు ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఆయన శుక్రవారం తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేశాక సభలో మాట్లాడారు. వరుసగా ఐదురోజులు ప్రతిపక్ష సభ్యులు తన బాధను వినిపించుకోలేదని.. ఐదు రోజులూ సస్పెండయ్యారని చెప్పారు. ‘ఏదోరకంగా గందరగోళం సృష్టించి సస్పెండవ్వాలనే చూస్తున్నారు. వారిని నియంత్రణ అయినా చేయాలి. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సభ నడిచేలా అయినా చేయాలి. విపక్ష సభ్యులకు తెలియని విషయం ఏంటంటే ఇలా గందరగోళం చేసి ఏదో చేశామంటూ రాజకీయ ప్రయోజనం పొందేవారి విషయంలో ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు జరిగింది అత్యంత హీనం.. హేయం. ఇలాంటి పోకడల నియంత్రణకు శాసనసభకు కమిటీలున్నాయి. అవసరం అనుకుంటే కఠిన సవరణలు తేవాలి’ అని పేర్కొన్నారు.