మోసాల బతుకు!
ABN , First Publish Date - 2020-12-05T08:30:45+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిది మోసాల బతుకని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు.

జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు
వంచనలు బయటపడతాయనే రోజూ సస్పెన్షన్
పిరికితనం, నిస్పృహకు ఇదే నిదర్శనం
వీడియోలు వేసి చూపించిన చంద్రబాబు
సీపీఎస్ రద్దు, పీపీఏలపై జగన్ అసత్యాలు
రైతులకు ప్రీమియం, పెన్షన్లపైనా..
జుట్టు, చెప్పులు తప్ప అన్నిటిపైనా పన్నులు
ఇసుక కొరతతో కార్మికులు విలవిల
మీరు మీ పొట్టలు నింపుకొంటున్నారు
చరిత్రలో లేనంతగా రైతులకు నష్టం
టిడ్కో ఇళ్లన్నీ ఉచితంగానే ఇవ్వాలి
అవినీతి సొమ్ముతో పేపర్, టీవీ పెట్టారు
మిగిలిన వారి గురించి మాట్లాడే హక్కుందా?
సీఎంపై టీడీపీ అధినేత ఫైర్
జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు
వంచనలు బయటపడతాయనే.ప్రతి రోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్
పిరికితనం, నిస్పృహకు ఇదే నిదర్శనం
వీడియోలు వేసి చూపించిన చంద్రబాబు
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిది మోసాల బతుకని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. నోరు తెరిస్తే అబద్ధాలేనని విమర్శించారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం లభిస్తే తన మోసాలు బయటపడతాయన్న భయంతో.. వరుసగా మొత్తం ఐదు రోజులూ శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించారని, జగన్‌ను ఆవహించిన పిరికితనం... నిస్పృహకు ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. టిడిఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో కలిసి శుక్రవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ రెడ్డి చెప్పిన అబద్ధాలకు సాక్ష్యమని పేర్కొంటూ కొన్ని వీడియోలను ఆయన ఈ సమావేశంలో ప్రదర్శించారు.
తుఫాను నష్టాలపై శ్రద్ధ ఏదీ..?
తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్లో బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్న రైతులు, కౌలు రైతులు భారీగా ఉన్నారని, వారిని ఆదుకోవడానికి... వారికి కలిగిన నషాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదని చంద్రబాబు ఆక్షేపించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పఽథకం కింద పనులు చేసిన వారిలో కూడా బీసీ వర్గాల వారే అధికంగా ఉన్నారని, వారి బిల్లులను పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం.. బడా కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం ఆగమేఘాలపై చెల్లిస్తోందని... పెద్ద కంపెనీలపై ఏ విజిలెన్స్ విచారణలు లేవని విమర్శించారు. టిడ్కో ఇళ్లు పొందిన వారిలో అత్యధికులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారేనని, వారిలో కొందరికి ఉచితంగా ఇచ్చి మరి కొందరి నుంచి డబ్బులు వసూలు చేస్తానంటే ఊరుకునేది లేదని, పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇంకా ఏమన్నారంటే..
పన్నులతో పిండేస్తున్నారు..
ఇంట్లో మరుగుదొడ్డి ఉంటే డ్రైనేజీ పన్ను, ఇంట్లో చెత్తను బయటకు తెస్తే చెత్త పన్ను, ఇంటి ముందు ఫుట్‌పాత్ ఉంటే ఫుట్‌పాత్ పన్ను, వీధి లైటు ఉంటే లైటు పన్ను కూడా వేయడానికి అంగీకరిస్తూ చట్టం తెచ్చారు. జుట్టు పెంచుకోవడానికి... చెప్పులు వేసుకోవడానికి తప్ప అన్నిటిపైనా పన్నులు వేస్తున్నారు. అదనంగా అప్పులు తెచ్చుకోవడం కోసం కేంద్రం విధించిన ప్రతి షరతుకూ జగన్ ప్రభుత్వం తలూపి ప్రజలపై విపరీతమైన పన్నుల భారం మోపుతోంది. ఆస్తి పన్నును ఏటా 15 శాతం చొప్పున పెంచనున్నారు. కొత్తగా రాష్ట్ర డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. దాని కోసం తెచ్చే అప్పుల కోసం అదనంగా పన్నులు, చార్జీలు వడ్డిస్తామని అసెంబ్లీలో పెట్టిన బిల్లులో తానే రాసింది. పెట్రోలు ధరలు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచేశారు. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా పిండుతున్నారు. ఈ ఏడాది ఆదాయానికి మించి అప్పులు తెచ్చారు. ఇన్నిన్ని అప్పులు దూసి తెచ్చి ఇష్టానుసారం ఖర్చు చేస్తే రాష్ట్రం పనికిరాకుండా పోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక బయటపడలేదని బీజేపీ ఎంపీ సురేశ్‌ప్రభు ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుక రేటు 5-10 రెట్లు పెరిగిపోయి సామాన్యులు, లక్షల మంది కార్మికులు నలిగిపోతుంటే ప్రభుత్వం వినోదం చూస్తోంది. తమ పార్టీ నేతల పొట్టలు నిండితే చాలన్నట్లుగా వ్యవహారం ఉంది. ఇస్తే ఇసుకను ఉచితంగా ఇవ్వాలి. లేదంటే రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేయాలి. ఎవరో ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి దోపిడీ చేయడం ఏమిటి?
లొంగకపోతే విద్రోహ శక్తులా?
అవినీతి డబ్బుతో పేపర్, టీవీ పెట్టుకున్న జగన్‌రెడ్డి.. స్వతంత్ర పత్రికలు, చానళ్లను తిట్టి కడుపు మంట చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు లొంగిపోతే దేశ భక్తులు... లేకపోతే సంఘ విద్రోహ శక్తులన్నట్లుగా జగన్ వ్యవహారం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల తరపున బలంగా పోరాడారు. కనీసం మాస్కులు పెట్టుకునే అలవాటు కూడా లేని పెద్ద మనుషులు కరోనా విషయంలో నన్ను విమర్శించే సాహసం చేస్తున్నారు. వైసీపీ నేతలే రాష్ట్రంలో ఈ వ్యాధికి సూపర్ స్ర్పెడర్లుగా మారారు.
వీడియో 1: తానుఅధికారంలోకి వస్తే వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని జగన్ చేసిన ప్రకటన ఇందులో ఉంది. గత ఏడాది మే 30వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఇప్పటికి ఎన్ని వారాలు గడిచాయని చంద్రబాబు ప్రశ్నించారు. దానిని రద్దు చేయలేకపోవడం మోసం కాదా అని నిలదీశారు.
వీడియో 2: జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లం అమరావతి సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏ పీపీఏ అవసరం లేకుండానే ఐదు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి తమ గడప వద్ద వేచి ఉన్నారని చెప్పారు. అదే నిజమైతే 30 ఏళ్లు విద్యుత్ కొనేలా పీపీఏలు ఎందుకు కుదుర్చుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. గడప వద్ద పడిగాపులు పడుతున్నవారంతా ఏమయ్యారని ఎద్దేవాచేశారు. తప్పుడు ప్రకటన చేసినందుకు కల్లంను ముఖ్యమంత్రి సస్పెండ్ చేయాలని.. లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వీడియో 3: 2019-20 సంవత్సరానికి సంబంధించి 55 లక్షల మంది రైతులను పంటల బీమా పధకం పరిధిలోకి తెచ్చామని, ప్రభుత్వమే వారి బీమా ప్రీమియంను చెల్లించినందువల్ల రైతుల సంఖ్య పెరిగిందని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. కానీ ప్రభుత్వం 26 లక్షల మందికే ప్రీమియం చెల్లించిందని చంద్రబాబు అన్నారు. సగం మందికి కట్టకుండానే కట్టినట్లుగా ప్రచారం చేసి ఫేక్ సీఎంనని జగన్ నిరూపించుకున్నారని విమర్శించారు.
వీడియో 4: అసెంబ్లీలో సీఎం గురువారం మాట్లాడుతూ 2018 అక్టోబరు నాటికి టీడీపీ హయాంలో పేదల సామాజిక పింఛన్ల సంఖ్య 44 లక్షలని చెప్పారు. మర్నాడు అదే సభలో.. అదే నెల నాటికి ఆ పింఛన్ల సంఖ్య 45 లక్షలని చెప్పారు. ఈ రెండూ నిజం కాదని.. ఆ నెలలో 50 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ రికార్డుల్లో సమాచారం వక్రీకరించి టీడీపీ తక్కువ పింఛన్లు ఇచ్చిందని చూపించేందుకు జగన్ మోసపూరితంగా ప్రయత్నించారని ధ్వజమెత్తారు.
వీడియో 5: పాదయాత్రలో జగన్ మాట్లాడుతూ తన తండ్రి పేదలకు 50 ఏళ్లకే పింఛను ఇచ్చారని, తాను దానిని ఇంకా తగ్గించి 45 ఏళ్లకే ఇస్తానని ప్రకటించారు. వైఎస్ 65 ఏళ్లు నిండిన వారికి మాత్రమే పింఛన్లు ఇచ్చారని, జగన్ పాదయాత్రలో 45 ఏళ్లకే ఇస్తానని పదేపదే ప్రచారం చేసి మాట మార్చారని చంద్రబాబు విమర్శించారు. పాదయాత్రలో ఒకటి చెప్పి మేనిఫెస్టోలో మరొకటి రాసి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.