అచ్చెన్నాయుడుకు మళ్లీ శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2020-06-18T10:17:40+05:30 IST
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం మరోసారి శస్త్రచికిత్స నిర్వహించారు. కొద్దికాలంగా ఆయన ఫిషర్
గుంటూరు మెడికల్, జూన్ 17: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో బుధవారం మరోసారి శస్త్రచికిత్స నిర్వహించారు. కొద్దికాలంగా ఆయన ఫిషర్ (ఆసనం చీలక)తో బాధపడుతున్నారు. దీనికితోడు ఆసనం సమీపంలో ఏర్పడ్డ చీము గడ్డ (పెరియానల్ హిమటోమా) పగిలి రక్తస్రావం జరిగింది. ఈఎ్‌సఐ ఆసుపత్రుల్లో ఔషధ కొనుగోలులో అవినీతి జరిగిందనే ఆరోపణలపై అచ్చెన్నను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం బాగోకపోవటంతో చికిత్స నిమిత్తం అదే రోజు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పరిశీలించిన వైద్యులు వెంటనే ఆయనకు శస్త్ర చికిత్సచేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు నివేదించగా.. వారి నుంచి అనుమతి లభించడంతో బుధవారం శస్త్రచికిత్స నిర్వహించారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, మూడో యూనిట్ చీఫ్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఆపరేషన్ చేసి.. చీము గడ్డను తొలగించి డ్రెస్సింగ్ చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైందని డాక్టర్ సుబ్బారావు తెలిపారు.