ఎస్వీబీసీ సీఈవోపై వేటు?
ABN , First Publish Date - 2020-08-11T09:17:49+05:30 IST
అయోధ్య రామాలయ భూమిపూజ ఎఫెక్ట్ టీటీడీకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ సీఈవో వెంకట నగే్‌షపై పడింది. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా కేంద్ర

- కొత్త సీఈవోగా సురేష్ కుమార్!
తిరుపతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): అయోధ్య రామాలయ భూమిపూజ ఎఫెక్ట్ టీటీడీకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ సీఈవో వెంకట నగే్‌షపై పడింది. ఆయన స్థానంలో కొత్త సీఈవోగా కేంద్ర సమాచార శాఖ అధికారి గేదెల సురేష్ కుమార్‌ను నియమించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సప్తగిరి దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ఆయన కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై వచ్చారు. సురే్‌షకుమార్‌ను దేవదాయశాఖకు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సోమవారం ఆదేశాలిచ్చారు. అయోధ్యలో ఈ నెల 6న జరిగిన శ్రీరామాలయ నిర్మాణ భూమిపూజను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేసినప్పటికీ.. హిందూధర్మ ప్రచారం కోసమే ఏర్పాటైన ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడాన్ని హిందూ సంఘాలు సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టాయి. ఆ సమయంలో తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం ప్రసారమవుతుండడం వల్ల అయోధ్య కార్యక్రమాన్ని ప్రసారం చేయలేకపోయామని టీటీడీ వివరణ ఇచ్చినా కేంద్రస్థాయిలో ఒత్తిడి రావడంతో ఎస్వీబీసీ సీఈవోను తప్పించక తప్పలేదని తెలుస్తోంది.