ఏబీవీ సస్పెన్షన్‌ రద్దుపై సుప్రీం కోర్టు స్టే

ABN , First Publish Date - 2020-11-27T08:01:40+05:30 IST

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఏబీవీ సస్పెన్షన్‌ రద్దుపై సుప్రీం కోర్టు స్టే

లేదంటే సాంకేతిక సమస్యలు వస్తాయని వెల్లడి

కేంద్రం సూచనలు ఎందుకుపాటించలేదు?

వెంటనే చార్జిమెమో అందించండి

అనుమతిలేకుండా 

సస్పెన్షన్‌ ఎలా పొడిగించారు?

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం


 న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అదే సమయంలో... ఆయన సస్పెన్షన్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను ఎందుకు పాటించలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సస్పెన్షన్‌కు అనుమతించిన సమయంలో 60 రోజులో చార్జిమెమో ఇవ్వాలని కేంద్రం సూచించినా ఎందుకు ఇవ్వలేదని నిలదీసింది. సస్పెన్షన్‌ను పొడిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరగా ఆయనకు చార్జిమెమోను అందించాలని ఆదేశించింది. ఇలా పెండింగ్‌లో ఉంచడం సరికాదని సూచించింది. గత ప్రభుత్వ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఏబీ సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేస్తూ తక్షణమే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. పిటిషన్‌లోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 3వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. స్టే విధించవద్దని ఏబీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణ రావు విజ్ఞప్తి చేశారు. కానీ, స్టే విధించకపోతే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


సస్పెన్షన్‌ ఎందుకు?

టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతోనే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెం డ్‌ చేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు అవునని ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది సీయూ సింగ్‌ సమాధానమిచ్చారు. ‘‘ఏబీ వెంకటేశ్వర రావు కుమారుడి జోక్యం ఉందన్న ఆరోపణలపై హైకోర్టులో విచారణ జరిగినట్లు మీరు దాఖలు చేసిన పత్రాల ద్వారా తెలుస్తుంది. ఒక టెండర్‌ ప్రక్రియకు సంబంధించిన అంశమే అయితే శాఖాపరమైన దర్యాప్తు చేయవచ్చు కదా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిబ్రవరిలో సస్పెండ్‌ చేసి... ఇప్పటికీ చార్జిమెమో ఇవ్వకుండా సస్పెన్షన్‌ను ఎలా కొనసాగించారు అని నిలదీసింది. చార్జిమెమో జారీ చేయకుండా ఏ అధికారినైనా సస్పెండ్‌ చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, ఆ సమయంలోనూ సస్పెన్షన్‌ ఉత్తర్వులు 60 రోజులపాటు మాత్రమే వర్తిస్తాయని సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణ స్పష్టం చేశారు. ‘‘ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో సస్పెన్షన్‌కు అనుమతిస్తూ రెండు నెలల్లో చార్జిమెమో అందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచించింది. కానీ, రాష్ట్రం దాన్ని పాటించలేదు. అంతేకాకుండా సస్పెన్షన్‌ను పొడిగించింది’’ అని తెలిపారు.  అయితే... సస్పెన్షన్‌ పొడిగింపునకు కేంద్రం అనుమతి ఉందని ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది సీయూ సింగ్‌ స్పష్టం చేశారు. ఆ ఉత్తర్వులు చూపించాలని ధర్మాసనం కోరగా... ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసిందని సమాధానమిచ్చారు. దీంతో... అనుమతి లేకుండా సస్పెన్షన్‌ను ఎలా పొడిగించారని ధర్మాసనం నిలదీసింది. కేంద్రం విధించిన షరతును కూడా రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోకపోవడంపైనా ప్రశ్నించింది.  రివ్యూ కమిటీ సస్పెన్షన్‌ను పొడిగించిందని సీయూ తెలిపారు.


హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా సస్పెన్షన్‌ను రివ్యూ కమిటీ ఎలా పొడిగించిందని ధర్మాసనం ప్రశ్నించింది. సస్పెన్షన్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉన్నందునే కమిటీ పొడిగించిందని సీయూ సింగ్‌ తెలిపారు. ఏబీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణ వాదిస్తూ... వెంకటేశ్వర రావుపై గత 30 ఏళ్ల సర్వీసులో ఒక్క మెమో కూడా జారీ కాలేదని... ఆయన రాష్ట్రపతి మెడల్‌, విశిష్ట సేవా మెడల్‌, పోలీసు మెడల్‌ అందుకున్నారని తెలిపారు. అయితే... రాజకీయ దురుద్దేశంతో సస్పెండ్‌ చేశారని వాదిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది.  ‘‘అలాం టి ఆరోపణలు చేయడం లేదు. కేవలం వ్యక్తిగత దురుద్దేశంతోనే చేశారు. 2019లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అధికారిని జీఏడీకి అటాచ్‌ చేశారు. ఈ ఏడాది జనవరి వరకు పోస్టింగ్‌  ఇవ్వలేదు’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ధర్మాసనం సంధించిన అనేక ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దాటవేత సమాధానాలు ఇవ్వడం పట్ల ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Read more