ఇంకెన్నిసార్లు మొట్టికాయలు?

ABN , First Publish Date - 2020-06-04T08:55:27+05:30 IST

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు వరుసగా తప్పుపట్టడంతో ఆ శాఖ ప్రతిష్ఠ మంటగలిసింది. ప్రాధాన్యం కలిగిన పోస్టులతో పాటు సీఎం మన్ననలు పొందేందుకు

ఇంకెన్నిసార్లు మొట్టికాయలు?

  • సచివాలయాలకు వైసీపీ రంగులపై ‘సుప్రీం’ షాక్‌ 
  • మరోసారి అభాసుపాలైన పంచాయతీరాజ్‌ శాఖ 
  • ఇవేమీ పట్టని ఉన్నతాధికారులు 
  • నిబంధనలు తోసిరాజని స్వామిభక్తికే ప్రాధాన్యం 


అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు వరుసగా తప్పుపట్టడంతో ఆ శాఖ ప్రతిష్ఠ మంటగలిసింది. ప్రాధాన్యం కలిగిన పోస్టులతో పాటు సీఎం మన్ననలు పొందేందుకు కొందరు ఉన్నతాధికారులు అడ్డగోలు విధానాలకు తెరదీస్తున్నారని, స్వామిభక్తి ప్రదర్శించడానికే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వ పెద్దల మనోభీష్టాన్ని నెరవేర్చేందుకు ఎన్నిసార్లయినా కోర్టు నుంచి మొట్టికాయలు తినేందుకు వీరు సిద్ధపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చట్టాల్ని గౌరవించి, వాటి పరిధిలో బాధ్యతలు నిర్వహించాల్సిన వారే చట్ట ధిక్కార చర్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలుపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయాలని వివాదస్పద మెమో ఇచ్చిన ఘనత పంచాయతీరాజ్‌ అధికారులకే దక్కింది. దీన్ని హైకోర్టు తప్పుపడితే సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అత్యున్నత ధర్మాసనం కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించడంతో కొత్త వ్యూహాలతో రంగులు తొలగించకుండా నెలల తరబడి తాత్సారం చేయడమే కాకుండా.. ఎర్రమట్టి రంగును కలిపి వేయాలంటూ జీవో.623ను విడుదల చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు గతనెలలో ఆ జీవోను రద్దు చేసింది. మే 28లోపు రంగులు తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ధిక్కార కేసు కింద హైకోర్టుకు హాజరైన సీఎస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్టవ్యతిరేకమైనా, కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సీఎం పంతం నెగ్గించేందుకే వీరు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. బుధవారం సుప్రీంకోర్టులోనూ రాష్ట్రానికి చుక్కెదురైంది. అధికారులు కోర్టుల సహనాన్ని పరీక్షిస్తున్నారని, ఈ విపరీత ధోరణి ఏదో ఒకరోజు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.


స్థానిక ఎన్నికల్లో పిలిమొగ్గలు 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోనూ పంచాయతీరాజ్‌ శాఖ పిల్లిమొగ్గలు వేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆర్డినెన్స్‌ తీసుకురావడం, ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల కోసం యాప్‌ రూపొందించడం, కోర్టు ఎన్నిసార్లు చెప్పినా... సచివాలయ రంగులు మార్చకుండా ఎన్నికలకు వెళ్లడం తదితర వివాదస్పద చర్యలకు అధికారులు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50శాతం మించరాదన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కాదని 59.85శాతంగా నిర్ణయించి ఎన్నికలను జాప్యం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో తిరిగి 50శాతం రిజర్వేషన్లతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి వచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం జెడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లకు సంబంధించి తారుమారు చేసి అభాసుపాలయ్యారు. కరోనా కారణంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్నికలను వాయిదా వేస్తే... ఏకంగా ఆయన్ను తొలగిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చేందుకూ వెనుకాడలేదు. రాజ్యాంగ బద్ధమా, చట్ట వ్యతిరేకమా అన్న అంశాలతో సంబంధం లేకుండా పాలకులు ఆదేశిస్తే చాలు పాటించే కొత్త సంప్రదాయానికి పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు తెరదీశారని విమర్శలొస్తున్నాయి.


కోర్టు ఆదేశాలు బేఖాతరు 

గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో అస్పష్ట వైఖరి, ముందస్తు ప్రణాళికలు లేకుండా సిబ్బంది నియామకం, పరీక్షల నిర్వహణలో అవకతవకలు తదితరాలపై ఈ శాఖ అధికారులు దూకుడుగా వ్యవహరించినట్లు విమర్శలున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చీ రాగానే ఉపాధి హామీ సిబ్బందిని తొలగించడం, ఆర్నెల్లపాటు ఉపాధి పనులు నిలిపేయడంతో ఏటా దేశంలోనే ఈ పథకంలో ముందున్న మన రాష్ట్రం వెనుకబడింది. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే చేయాలన్న స్వామిభక్తితో గతంలో చేపట్టిన ఉపాధి పనులకు బిల్లులు చెల్లించకుండా మెమోలు జారీచేశారు. కేంద్రం నుంచి ఆ పథకానికి వచ్చిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. కోర్టు ఆదేశించినా గతంలో చేపట్టిన పనుల బిల్లుల బకాయిలు చెల్లించకుండా జాప్యం చేసేందుకు అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ఇంకా జాప్యం చేసేందుకు ఆ పనులపై తాజాగా తనిఖీలకు ఆదేశించారు.

Updated Date - 2020-06-04T08:55:27+05:30 IST