జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్..!

ABN , First Publish Date - 2020-03-18T17:59:03+05:30 IST

సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల వాయిదాను సమర్థించింది.

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఝలక్..!

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల వాయిదాను సమర్థించింది. ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది ఈసీదే నిర్ణయాధికారం అని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఎన్నికల కోడ్‌ను తక్షణమే ఎత్తివేయాలని ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం ఏవైనా కొత్త ప్రాజెక్టులు, పథకాలు చేపట్టాలంటే ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. అయితే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు కొత్త తేదీలు ప్రకటించాక 4 వారాల ముందు నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2020-03-18T17:59:03+05:30 IST