రిజర్వేషన్లకు రాంరాం

ABN , First Publish Date - 2020-10-08T07:29:18+05:30 IST

గ్రామీణ, గిరిజన ప్రాంత వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. సర్వీస్‌ కోటా వైద్యులకు పీజీ విద్యను దూరం చేస్తోంది. పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్‌ వైద్యులకు.....

రిజర్వేషన్లకు రాంరాం

సర్వీస్‌ కోటా వైద్యులకు అన్యాయం

పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్‌ రిజర్వేషన్లకు తూట్లు

ఏటా 300 పీజీ సీట్లు కోల్పోతున్న సర్వీస్‌ వైద్యులు

సుప్రీం చెప్పినా పట్టించుకోని ప్రభుత్వం


అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ, గిరిజన ప్రాంత వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. సర్వీస్‌ కోటా వైద్యులకు పీజీ విద్యను దూరం చేస్తోంది. పీజీ కౌన్సెలింగ్‌లో సర్వీస్‌ వైద్యులకు రిజర్వేషన్లు అమలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తోంది. ప్రభుత్వ వైఖరితో ఈ ఏడాది సర్వీస్‌ కోటా వైద్యులు 300 పీజీ సీట్ల వరకూ కోల్పోయారు. సర్వీస్‌ కోటా డాక్టర్లకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఉన్నత విద్యకు దూరమవుతామని గ్రామీణ, గిరిజన ప్రాంతాల  వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2017 వరకూ సర్వీస్‌ కోటా వైద్యులకు పీజీ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు ఉండేవి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఉన్న పీజీ సీట్లలో క్లినికల్‌ విభాగంలో 30 శాతం, నాన్‌ క్లినికల్‌ విభాగంలో 50 శాతం సీట్లు సర్వీస్‌ కోటా వైద్యులకు కేటాయించేవారు. సర్వీస్‌ కోటా రిజర్వేషన్లతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు ఉన్నత చదువులు చదివేందుకు ఎక్కువ అవకాశాలు ఉండేవి. 2017 తర్వాత సుప్రీం తీర్పుతో అన్ని రాష్ట్రాలూ సర్వీస్‌ కోటా వైద్యులకు రిజర్వేషన్లు రద్దు చేశాయి.


ఈ రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. అదే సమయంలో ఏపీ ఆలిండియా కోటాలోకి ప్రవేశించింది. ఆలిండియా కోటాలోకి వెళ్తే ఏపీ విద్యార్థులకు దేశంలో ఎక్కడైనా మెడికల్‌ పీజీ సీట్లు తీసుకునే అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న 900 సీట్లలో 50 శాతం సీట్లు ఆల్‌ ఇండియా కోటాకు కేటాయించింది. మిగిలిన 50 శాతంలో అంటే 450 సీట్లను సర్వీస్‌, నాన్‌ సర్వీస్‌ అభ్యర్థులకు కేటాయించింది. దీని వల్ల సర్వీస్‌ కోటా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు - సర్వీస్‌ కోటా వైద్యుల రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కీలక తీర్పు ఇచ్చింది.  ఎంసీఐ జోక్యం లేకుండా రాష్ట్రాల్లో ఉన్న అవకాశాల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని తెలిపింది. అయితే సుప్రీం తీర్పు అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నాన్చుడి ధోరణితోనే వ్యవహరిస్తోంది. 


వెయిటేజీతో వేస్ట్‌..!

సర్వీస్‌ కోటా వైద్యులకు రిజర్వేషన్లు రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెయిటేజీ అవకాశం కల్పించింది. రూరల్‌ ప్రాంతాల్లో పని చేసిన వైద్యులకు 8 శాతం, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వైద్యులకు 10 శాతం వెయిటేజీ కల్పించింది. కానీ ఈ వెయిటేజీ తో పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఒక వైపు పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తూనే మరోవైపు నీట్‌ పరీక్షకు సర్వీస్‌ వైద్యులు సిద్ధం కావాలి. దీనివల్ల వారిపై అధిక భారం పడుతోంది. దీంతో నీట్‌లో అర్హత సాధించినా పీజీ సీట్లు వచ్చేంత స్థాయిలో సర్వీస్‌ వైద్యులకు ర్యాంకులు రావడం లేదు.   


తమిళనాడులో రిజర్వేషన్లు.. 

సుప్రీం తీర్పు తర్వాత తమిళనాడు సూపర్‌ స్పెషాలిటీ సీట్ల భర్తీ ప్రక్రియలో సర్వీస్‌ కోటా అభ్యర్థులకు రిజర్వేషన్లు కల్పించింది. అంతేకాదు పీజీ సీట్ల భర్తీ ప్రక్రియలో 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచనలో కూడా ఉంది. అటు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలన్నీ సర్వీస్‌ కోటా రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. చివరికి పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా రిజర్వేషన్లు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. వెంటనే తమకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సర్వీస్‌ వైద్యులు డిమాండ్‌ చేస్తున్నారు. రిజర్వేషన్లు కల్పించడం వల్ల సర్వీస్‌ కోటా కింద 300 పీజీ సీట్లు అందుబాటులో ఉండేవని, రిజర్వేషన్ల రద్దుతో తమకు నష్టం జరుగుతోందని అంటున్నారు. సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా తమకు 50ు రిజర్వేషన్లు కల్పించాలని, లేకపోతే పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-10-08T07:29:18+05:30 IST