‘వాయిదా’కు ఓకే!

ABN , First Publish Date - 2020-03-19T09:08:12+05:30 IST

స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల వాయిదాను సర్వోన్నత న్యాయస్థానం...

‘వాయిదా’కు ఓకే!

  • స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పు
  • కరోనా విజృంభణ నేపథ్యంలోనే ఎస్‌ఈసీ నిర్ణయం
  • ఇందులో న్యాయస్థానం జోక్యం అవసరం లేదు
  • వాయిదా తర్వాతా కోడ్‌ అమలుకు నిరాకరణ
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి తేదీలు
  • పోలింగ్‌కు నాలుగు వారాల ముందు నుంచి కోడ్‌
  • అమలులో ఉన్న అభివృద్ధి పనులకు ఆటంకం లేదు
  • కొత్త పథకాలకు ఎస్‌ఈసీ అనుమతి తప్పదు: సుప్రీం 


న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల వాయిదాను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ‘‘రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయంలో... అది కూడా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరమేదీ కనిపించడం లేదు. అందువల్ల ఈ విషయం జోలికి మేం వెళ్లడం లేదు’’ అని తేల్చి చెప్పింది. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తరఫు న్యాయవాదుల వాదనలు ఆలకించిన అనంతరం... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ తీర్పు చెప్పింది. ఎన్నికలపై ఎస్‌ఈసీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోబోమంటూనే.. వాయిదా కాలంలోనూ ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమలులో ఉంటుందన్న రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనపై మాత్రం స్పందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.


ఎన్నికలు వాయిదా వేసినప్పటికీ కోడ్‌ అమల్లో ఉండడం సరికాదని, అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అన్స్‌ నాద్‌కర్ణి వివరించారు. అయితే... సాధారణ ఎన్నికల సమయంలో 4 నెలలు కోడ్‌ అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శేఖర్‌ నఫడే తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తొలగించింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి మాత్రమే కోడ్‌ను అమలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంతో తగిన సంప్రదింపులు జరపకుండా ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదని నాద్‌కర్ణి వాదించారు. ‘కిషన్‌సింగ్‌ తోమర్‌ వర్సెస్‌ అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉదహరించారు. ఆర్టికల్‌ 32 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంలో కోర్టును ఆశ్రయించే అధికారమే లేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది శేఖర్‌ నాఫడే పేర్కొన్నారు. ‘కిషన్‌సింగ్‌ తోమర్‌’ కేసుకు ముందస్తు సంప్రదింపులతో సంబంధం లేదని తెలిపారు. ధర్మాసనం... ఈ అంశం జోలికి వెళ్లేందుకు కూడా నిరాకరించింది. ఎన్నికలను వాయిదా వేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం సంప్రదించలేదన్న అంశం ప్రస్తుతం పరిశీలించదగ్గ వివాదం కాదని తెలిపింది.


‘‘ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అందువల్ల, తిరిగి ఎన్నికల తేదీని నిర్ణయించేముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. పోలింగ్‌ తేదీకి 4 వారాల ముందు నుంచి మాత్రమే కోడ్‌ అమలులోకి తేవాలి’’ అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలనుకుంటే అందుకు ఎన్నికల సంఘం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు... కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఎలాంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇంప్లీడ్‌ కావడానికి అనుమతించాలంటూ తెనాలికి చెందిన వేమూరి శేషగిరి రావు విజ్ఞప్తి చేశారు. కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాం, ప్రభుత్వ న్యాయవాది జీఎన్‌ రెడ్డి, సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ కె.పరమేశ్వర్‌, శేషగిరిరావు తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ గుంటూరు ప్రమోద్‌ కుమార్‌ హాజరయ్యారు.


Updated Date - 2020-03-19T09:08:12+05:30 IST