నాలుగుగోడల మధ్య జరిగే అవమానం..

ABN , First Publish Date - 2020-11-06T09:10:20+05:30 IST

షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల(ఎస్సీ, ఎస్టీ)కు చెందిన వారిని నాలుగు గోడల మధ్య అవమానిస్తే అది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకు రాదని

నాలుగుగోడల మధ్య జరిగే అవమానం..

ఎస్సీ, ఎస్టీ చట్టం పరిధిలోకి రాదు!

ఎవరైనా చూసే అవకాశం ఉన్న స్థలాల్లో లేదా..

ఎవరైనా చూస్తున్నప్పుడు అవమానిస్తేనే నేరం: సుప్రీం కోర్టు


న్యూఢిల్లీ, నవంబరు 5: షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల(ఎస్సీ, ఎస్టీ)కు చెందిన వారిని నాలుగు గోడల మధ్య అవమానిస్తే అది ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకు రాదని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ఒక దళిత మహిళను హితేశ్‌ వర్మ అనే వ్యక్తి అతడి ఇంటిలో అవమానించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీకి చెందిన వ్యక్తులను వారి కులాల, తెగల విషయంలో అవమానిస్తేనే అట్రాసిటీ చట్టం వర్తిస్తుంది. అలా కాకుండా ఇతర విషయాల కారణంగా జరిగిన అవమానాన్ని ఆ చట్టం కింద పరిగణించలేం. అదే విధంగా.. ఎవరైనా చూసే అవకాశం ఉన్న స్థలాల్లో లేదా ఎవరైనా చూస్తున్నప్పుడు వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని అవమానించడం అట్రాసిటీ చట్టం కిందకు వస్తుంది.


ఈ నేపథ్యంలో ప్రస్తుత కేసులో నిందితుడికి, బాధితురాలిగా చెప్పబడుతున్న మహిళకు నాలుగు గోడల మధ్య జరిగిన ఘటనను ఎస్సీ, ఎస్టీ కేసుగా పరిగణించలేం’’ అని సుప్రీం స్పష్టం చేసింది. అయితే.. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కాక.. క్రిమినల్‌ కేసు కోణంలో ఇతర కోర్టుల్లో విచారణ జరుగుతుందని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 2008లో స్వర్ణ్‌ సింగ్‌ కేసు ఆధారంగా తాజా తీర్పును ఇస్తున్నామని కోర్టు పేర్కొంది. 

Updated Date - 2020-11-06T09:10:20+05:30 IST