సూపర్‌ కిక్‌!

ABN , First Publish Date - 2020-09-03T08:25:19+05:30 IST

పైకి చెబుతున్నది మద్య నియంత్రణ మాట! అదే పేరిట... ‘వింత బ్రాండ్ల’తో కోట్లకు కోట్ల వేట

సూపర్‌ కిక్‌!

త్వరలో లిక్కర్‌ సూపర్‌ మార్కెట్లు

72 చోట్ల వాక్‌-ఇన్‌-స్టోర్ల ఏర్పాటు.. తర్వాత పర్యాటక కేంద్రాల్లో!

అందులోనూ ‘అస్మదీయ’ బ్రాండ్లే.. ప్రీమియం మద్యంతో ఆకర్షణ


‘పేద కుటుంబాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. సంపూర్ణ మద్య నిషేధమే మా లక్ష్యం. దీన్ని దశల వారీగా నిషేధిస్తాం. ఈలోగా మద్యం తాగడాన్ని నిరుత్సాహపరిచేందుకు అన్ని చర్యలూ తీసుకుంటాం’... ఇదీ వైసీపీ ప్రభుత్వం పదేపదే చెప్పిన మాట. కానీ ఎక్కడో మారుమూల ఉండాల్సిన మద్యం షాపులను ఇప్పుడు సూపర్‌ మార్కెట్ల తరహాలో నగరాలు, పట్టణాల నడిబొడ్డులో ఆకర్షణీయంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

పైకి చెబుతున్నది మద్య నియంత్రణ మాట! అదే పేరిట... ‘వింత బ్రాండ్ల’తో కోట్లకు కోట్ల వేట! షాక్‌ కొట్టేలా ధరలు... ఏటా 20 శాతం షాపుల తగ్గింపు అంటూ ఘనంగా ప్రకటనలు చేస్తున్నారు. అయితే... ఇప్పటిదాకా కొత్త, వింత బ్రాండ్ల పేరుతో సాగుతున్న కాసుల వేటకు, అతిత్వరలో ‘ప్రీమియం’ టచ్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సూపర్‌ మార్కెట్ల తరహాలో లిక్కర్‌ అమ్మకాల కోసం ‘వాక్‌ ఇన్‌’ స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ తరహా సూపర్‌ మార్కెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.


‘వాక్‌ ఇన్‌ స్టోర్‌... ప్రీమియం’ అనే మాట వినగానే... గతంలోలాగా అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంటాయనుకుంటే ‘పెగ్గు’లో కాలేసినట్లే. ఈ స్టోర్స్‌లో కూడా అస్మదీయులకు చెందిన అనామక బ్రాండ్లలోనే ప్రీమియం తరహా మద్యం అమ్మేందుకు వీలుగా ఈ స్టోర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.


వీటిని తొలుత పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసి... కరోనా అనంతరం పర్యాటక ప్రాంతాల్లోనూ ఈ తరహా స్టోర్లకు అనుమతి ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది. పాపులర్‌ బ్రాండ్లు కనిపించకుండా పోవడంతో సొంత బ్రాండ్లలోనే కొంత మెరుగైన వాటిని అధిక ధరలకు అమ్మాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేటు మద్యం షాపుల పాలసీ అమల్లో ఉన్నప్పుడు విశాఖ, విజయవాడ, గుంటూరుల్లో ఒకట్రెండు చొప్పున ఇలాంటి స్టోర్లు ఉన్నాయి. సాధారణ మద్యం షాపుల్లో మందుబాబులు బయటే నిలబడి ఫలానా బ్రాండ్‌ కావాలని అడిగితే ఇస్తారు.


కానీ వీటిల్లో వినియోగదారుడు నేరుగా షాపులోకి వెళ్లి తనకు ఏది కావాలో వెతికి తెచ్చుకుని... సూపర్‌ మార్కెట్ల తరహాలో బిల్లింగ్‌ చేయించుకుంటాడు. ఇలాంటి వాటినే ఇప్పుడు 72 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపై ఎక్సైజ్‌ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పెద్ద పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. నగరాల్లో నెలకు కనీసం రూ.2-3లక్షలు అద్దె పెట్టకపోతే విశాలంగా ఉండే భవనాలు దొరకవు. ఈ మొత్తంలో కొంత జేబులో వేసుకొనే ఉద్దేశంతో కొందరిని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. కొంత భవనం యజమానికి, కొంత మాకు అనే స్కీంతో వీరు అగ్రిమెంట్లకు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేయదలచిన వాక్‌ ఇన్‌ స్టోర్లు కూడా ప్రభుత్వ షాపులే. ఇక్కడా ప్రభుత్వం నియమించే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ పనిచేస్తారు.


అయితే సాధారణ రిటైల్‌ అవుట్‌లెట్లలో పరిమితంగా చీప్‌ తరహా బ్రాండ్లు మాత్రమే దొరికితే వీటిలో ధర ఎక్కువగా ఉండే ప్రీమియం బ్రాండ్లు అందుబాటులో ఉంచుతారు. అయితే అవి కూడా కొత్త బ్రాండ్లకు చెందిన కంపెనీలవే ఉంటాయని తెలిసింది. వాటిలోనే ప్రీమియం తరహా మద్యాన్ని అధిక ధరకు అమ్మడం ద్వారా తమకు కావాల్సినవారికి మేలు చేయాలనేదే అసలు ప్లాన్‌ అని చెబుతున్నారు.


Updated Date - 2020-09-03T08:25:19+05:30 IST