‘ఇల్లు’ రాలేదని ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-12-28T09:20:18+05:30 IST

ఇళ్ల స్థలాలకు రెండుసార్లు ప్రకటించిన అర్హుల జాబితాలో ఆయన పేరుంది. పట్టాల పంపిణీలో మాత్రం ఇంటి స్థలం పట్టా అందలేదు.

‘ఇల్లు’ రాలేదని ఆత్మహత్యాయత్నం

పురుగుల మందు తాగిన వ్యవసాయ కూలీ

ప్రకాశం జిల్లా లింగంగుంటలో ఘటన


ఒంగోలు కార్పొరేషన్‌, డిసెంబరు 27: ఇళ్ల స్థలాలకు రెండుసార్లు ప్రకటించిన అర్హుల జాబితాలో ఆయన పేరుంది. పట్టాల పంపిణీలో మాత్రం ఇంటి స్థలం పట్టా అందలేదు. అధికారులను ప్రశ్నించగా, ‘మహిళలకు మాత్రమే’ అంటూ సెలవిచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యవసాయ కూలీ ఆత్మహత్యకు యత్నించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంటలో శనివారం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అంబటి శ్రీనివాసులు వ్యవసాయ కూలీ. ఆయన భార్య గతంలో మరణించింది. కుమార్తె ఇంటర్‌ చదువుతోంది. సొంతిల్లు లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండుసార్లు ప్రకటించిన అర్హుల జాబితాలో ఆయన పేరున్నట్లు సచివాలయ సిబ్బంది చెప్పారు. శనివారం జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కొద్దిమంది మహిళలకు పట్టాలు అందజేసి వెళ్లిపోయారు. తనకు పట్టా ఇవ్వకపోవడంతో శ్రీనివాసులు అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం మహిళల పేర్లపైనే ఇస్తున్నామని సెలవిచ్చారు. అర్హుల జాబితాలో తన పేరు ఉందని శ్రీనివాసులు చెప్పగా, పొరపాటు జరిగి ఉంటుందని, మహిళల పేర్లు మాత్రమే ఉన్నాయని తేల్చిచెప్పారు. తనకు భార్య లేదని, ఇంటికి వచ్చి పరిస్థితులు పరిశీలించాలని వేడుకున్నా పట్టించుకోలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాసులు అక్కడే పురుగు మందు తాగారు. స్థానికులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2020-12-28T09:20:18+05:30 IST