కోడుమూరు వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు!

ABN , First Publish Date - 2020-10-08T02:43:15+05:30 IST

ఆ నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య కుమ్ములాటలు శ్రుతిమించుతున్నాయి. ఎమ్మెల్యే పదవిని..

కోడుమూరు వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు!

ఆ నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య కుమ్ములాటలు శ్రుతిమించుతున్నాయి. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని అక్రమ దందాలు చేస్తున్నారని ఇన్‌ఛార్జ్ ఆరోపిస్తున్నారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ నాపై నిందలు వేస్తారా అని సదరు శాసనసభ్యుడు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇద్దరిపై అవినీతి ఆరోపణలు వారానికొకటి అధిష్టానం దగ్గరికి వెళ్తున్నాయట. వర్గపోరుతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే ఆ విషయంలో పార్టీ మారాల్సి వస్తుందన్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏమిటా కథ?   


కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీలో వర్గపోరు ముదురుతోంది. ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కలిసిమెలిసి ఉండాల్సిన సొంతపార్టీ నాయకులు మాటల తూటాలు పేల్చుతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నది నువ్వంటే నువ్వని పరస్పసరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యేపై జరుగుతున్న ఓ ప్రచారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  



ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్‌ రాకపోతే..బీజేపి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డితో ఉన్న విబేధాలే ఇందుకు ప్రధాన కారణమట. 2019 ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం చెడింది. దీంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సీనియర్ కార్యకర్తలతో ఎమ్మెల్యే సుధాకర్ సమావేశం నిర్వహించారట. వన్‌సైడ్‌గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో సీటు విషయంలో ప్రభావం పడుతుందేమోనని ఓ కార్యకర్త తన సందేహాన్ని వ్యక్తం చేశారు. మనం చేసిన అభివృద్దిని బట్టి సీఎం జగన్‌ టికెట్ ఇస్తే మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేస్తా...లేదంటే బీజేపీ నుంచి బరిలో నిలబడతానని ఎమ్మెల్యే అన్నట్లు సమాచారం. ఈ విషయం నియోజకవర్గం అంతటా వ్యాపించింది. ఇప్పుడిదే విషయం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. 


ఎమ్మెల్యే సుధాకర్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఎర్రమట్టి, ఇసుక, అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. బెళగల్ మండలంలో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తూ ఎమ్మెల్యే కోట్లు కూడబెట్టారన్నది కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి వర్గం వాదన. కోడుమూరులో ఎర్రమట్టి అక్రమ రవాణాకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి పాల్పడుతున్నారన్నది ఎమ్మెల్యే వర్గం అభియోగం. 


కర్నూలు మండలంలోని గార్గేయపురం, నందనపల్లె, సూదిరెడ్డి పల్లె, బి.తాండ్రపాడు, వెంకాయపల్లె ప్రాంతాల్లో వెలసిన వెంచర్లలో ఎకరాకు పది లక్షలు ఇవ్వాలని....గార్గేయపురంకు చెందిన ఓ కార్యకర్త ద్వారా ఎమ్మెల్యే డీల్ చేస్తున్నట్లు కోట్ల హర్షవర్గం ఆరోపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే బంధువు అక్రమ మద్యం తరలిస్తూ నాగలాపురం సరిహద్దుల్లో పోలీసులకు చిక్కాడు. ఈ వ్యవహారం వెనక కోట్ల హర్ష వర్దన్‌రెడ్డి హస్తం ఉన్నట్లు ఎమ్మెల్యే వర్గం ఆక్షేపిస్తోంది. 



అధికార పార్టీలోకి టీడీపీ కార్యకర్తలు, నాయకులను చేర్చుకునే విషయంలో రెండు వర్గాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయట. కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అనుచరుడు రాజశేఖర్ రెడ్డికి కోట్ల హర్షవర్దన్‌ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలున్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే సుధాకర్ అమరావతి తీసుకెళ్లి జిల్లా ఇంచార్జ్‌ మంత్రి అనిల్ కుమార్ సమక్షంలో పార్టీలో చేర్పించారు. ఈ విషయంపై కోట్ల హర్ష వర్గం భగ్గుమంటోంది. నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న సీనియర్లను కాదని..వలస నాయకులకే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతోంది.


కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ పెద్దలు వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించినా ఫలించలేదు. రెండు వర్గాల నుంచి అవినీతి, అక్రమాలపై వారానికో ఫిర్యాదు పార్టీ హైకమాండ్‌కు వెళ్తోందట. ఈ పరిణామాలతో పలువురు కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఇద్దరి మధ్య నలిగిపోయి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్దమయ్యారట. కోడుమూరు నియోజకవర్గంలో ముదిరిపాకన పడుతున్న వర్గపోరుకు అధిష్టానం చెక్‌పెడుతుందో లేదో చూడాలి. 

Updated Date - 2020-10-08T02:43:15+05:30 IST