భయం.. భయం

ABN , First Publish Date - 2020-05-08T09:39:06+05:30 IST

క్కడికక్కడ రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అచేతనంగా పడిపోయిన మహిళలు, పిల్లలు! కుమార్తెను పట్టుకుని పరుగులు తీస్తున్న తల్లి! స్పృహ కోల్పోయిన కుటుంబ సభ్యుడికి ఫుట్‌పాత్‌పైనే సపర్యలు చేస్తూ మరొకరు! అక్కడంతా భీతావహ పరిస్థితి!

భయం.. భయం

దారిపొడవునా పడిపోయిన జనం

పరుగులు తీస్తూనే ఒకరి తుదిశ్వాస

కళ్లు కనిపించక బావిలో పడి ఒకరి మృతి

రోడ్డుపై పడి మరొకరు..



ఎక్కడికక్కడ రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అచేతనంగా పడిపోయిన మహిళలు, పిల్లలు! కుమార్తెను పట్టుకుని పరుగులు తీస్తున్న తల్లి! స్పృహ కోల్పోయిన కుటుంబ సభ్యుడికి ఫుట్‌పాత్‌పైనే సపర్యలు చేస్తూ మరొకరు! అక్కడంతా భీతావహ పరిస్థితి! కొందరు మురుగు కాల్వల్లో పడిపోయారు. ఎవరు బతికి ఉన్నారో, ఎవరు మరణించారో తెలియనంత దయనీయ స్థితి. ఇది అనుకోని ఉపద్రవం!  దీంతో దారిపొడవునా పదుల సంఖ్యలో అపస్మారక స్థితిలో పడిపోయారు. మరికొందరైతే ప్రాణాలు దక్కించుకోవాలనే ఆత్రుతలో చీకట్లో ఎటువైపు వెళుతున్నామో తెలియకుండా పరిగెత్తారు. కళ్లుమంటలతో చూపు కనిపించక  చిన్ని గంగరాజు అనే వ్యక్తి నూతిలో పడి ప్రాణాలు వదిలాడు. ఆంధ్ర వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అన్నెపు చంద్రమౌళి (19) ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు తీస్తుండగానే ఊపిరి ఆగిపోయింది.


మరొకరు కూడా అలాగే ప్రాణాలు పోగొట్టుకున్నారు. గోపాలపట్నం నుంచి బంధువుల ఇంటికి స్కూటీపై వెళ్తున్న ఆంధ్రాబ్యాంకు రిటైర్డ్‌ మేనేజర్‌  రత్నాల గంగాధర్‌ చౌదరి (64) విష వాయువు పీల్చి చింతలపాలెం చెక్‌పోస్టు వద్ద ఉన్నపళంగా పడిపోయారు. ఆయనను కొత్తవలస పీహెచ్‌సీలో చేర్చగా... చికిత్స పొందుతూ మరణించారు. ఆరేళ్ల చిన్నారి కుందనా శ్రేయ, తొమ్మిదేళ్ల బాలిక ఎన్‌.గ్రీష్మలను విష వాయువు కబళించింది. కేజీహెచ్‌లో చేర్చిన 44 మంది పిల్లల పరిస్థితి బాగుందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.




ఒక్కరోజులో జరిగిందా!

స్టైరిన్‌ రసాయనాన్ని ఎల్లప్పుడూ 20 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచాలి. అంతకన్నా ఉష్ణోగ్రత పెరిగితే ఆ రసాయనం దగ్గరగా వచ్చి గడ్డకట్టినట్లు అవుతుంది. ఈ ప్రక్రియనే పాలిమరైజేషన్‌ అంటారు. దీనిని నివారించేందుకు ప్రతి నాలుగు రోజులకోసారి ఇతర రసాయనాలను స్టైరిన్‌లో కలుపుతుంటారు. తాజా ప్రమాదాన్ని చూస్తే... ఈ ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగినట్లు అర్థమవుతోంది. ఇది ఒక్క రోజులో పెరిగిన ఉష్ణోగ్రతలు కావని భావిస్తున్నారు.  స్టైరిన్‌ రసాయనం 60, 70 డిగ్రీల సెంటీగ్రేట్‌ దాకా పాలిమరైజేషన్‌ అవుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సుమారు వంద డిగ్రీలు దాటాక అది విస్ఫోటనానికి దారి తీస్తుంది. అదే జరిగితే... విశాఖ మరో భోపాల్‌గా మారేదని చెబుతున్నారు.

                                                            - స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-05-08T09:39:06+05:30 IST