కరోనా కట్టడికి ప్రణాళిక

ABN , First Publish Date - 2020-03-19T08:27:52+05:30 IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు పురపాలకశాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాణాంతక మహమ్మారిని తొలిదశలోనే నిరోధించకపోతే రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా...

కరోనా కట్టడికి ప్రణాళిక

  • కార్యాచరణపై నేడు పురపాలకశాఖ ప్రకటన?


అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు పురపాలకశాఖ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాణాంతక మహమ్మారిని తొలిదశలోనే నిరోధించకపోతే రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారుతుందనే ఉద్దేశంతో ఆ శాఖ ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితం నుంచే ప్రణాళిక తయారీలో నిమగ్నమయ్యారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉండే నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో కరోనా వ్యాప్తికి ఆస్కారం ఎక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల్లో దానిని అడ్డుకునేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా పారిశుద్ధ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని భావించారు.


ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఉన్నతాధికారులు భేటీ అయి, విస్తృతంగా చర్చించారు. అనంతరం ఈ వారం నుంచే కార్యాచరణ ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కరోనా వ్యాప్తిని కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో పురపాలక శాఖ ప్రణాళిక పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు తర్వాత పురపాలక శాఖ తన ప్రణాళిక అమలుకు సిద్ధమైంది. 

Updated Date - 2020-03-19T08:27:52+05:30 IST