ఏలూరులో వింత రోగం..ఎక్కడి వారు అక్కడే..

ABN , First Publish Date - 2020-12-06T14:19:23+05:30 IST

ఏలూరులో ఉన్నవారు ఉన్నట్లే కిందపడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు.

ఏలూరులో వింత రోగం..ఎక్కడి వారు అక్కడే..

ప.గో.జిల్లా: ఏలూరులో ఉన్నవారు ఉన్నట్లే కిందపడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు. చిన్నపిల్లలతో సహా సమారు వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే కళ్లు తిరిగిపడిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.  ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 20 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు రక్త పరీక్షలు,  సిటీ స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడంలేదు. మంచినీరు, వాయు కాలుష్యం కారణం కావచ్చునని వైద్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కాచి తాగాలని,  అవసరమైతే బయటకు రావాలంటూ వైద్యుల సూచిస్తున్నారు. పరిస్థితిని మంత్రి ఆళ్ళ నాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు ఏలూరు కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. నెం.. 9154592617.


ఇంటి ముందు వాకిట్లో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక అకస్మాత్తుగా నేలపై పడి నోటి వెంబడి నురుగులు కక్కుతూ మూర్చ వచ్చి కొట్టుకులాడి స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయి ఆ బిడ్డను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సెలైన్లు, ఇంజక్షన్లు ఇవ్వగా కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. మరో ఘటనలో రోడ్డుపై నడుస్తున్న 18 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా కిందపడిపోయి ఫిట్స్‌తో కొట్టుకులాడుతూ స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు యువకుడి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెనువెంటనే ఆ యువకుడిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఈలోపే సాధారణ స్థితికి చేరుకున్నాడు.


మరికొన్ని ఘటనల్లో యువతులు కూడా ఇలానే అకస్మాత్తుగా నేలపై పడి కొట్టుకులాడి, స్పృహ కోల్పోయారు. ఇలా.. ఆరేళ్ల పసిబిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం ఏలూరు నగరంలోని దక్షిణపు వీధిలో మొదలైన ఈ అంతుపట్టని వ్యవహారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. శనివారం ఉదయం ఒకొక్కరుగా ఆసుపత్రికి రావడంతో ఆసుపత్రి వైద్యులు సాధారణ ఫిట్స్‌గా భావించి సేవలు అందించారు. అయితే, సాయంత్రానికి వీరి సంఖ్య వంద దాటడడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వ్యాధి ఏమిటనే దానిపై చర్చించారు. దాదాపు వంద మంది ఇలా పడిపోవడంతో ప్రతి ఒక్కరికీ సిటీస్కానింగ్‌ నిర్వహించారు. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అంతుపట్టని వ్యాధిగా వైద్యులు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరిన ఆరేళ్ల ప్రభ అనే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఈ వ్యాధి నిర్ధారణపై ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు.


నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లి ఇంటింటి సర్వే చేపట్టారు. వారు తిన్న ఆహారం, తాగిన నీరు, పరిసరాలను పరిశీలించారు. శనివారం రాత్రికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఒకొక్కరుగా ఆసుపత్రికి రావడంతో నగరం అంతా వ్యాపించిందని గుర్తించారు. అయితే గాలి కాలుష్యమా, నీటి కాలుష్యమా, దోమల వలన వచ్చిందా అనేది అంతుచిక్కలేదు. ఆసుపత్రి చీఫ్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ పోతుమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు వైద్య సేవలు అందిస్తున్నాయి. 

Updated Date - 2020-12-06T14:19:23+05:30 IST