విష ప్రచారం ఆపకపోతే పరువు నష్టం దావా

ABN , First Publish Date - 2020-02-12T09:05:24+05:30 IST

‘నేనింత వరకు ఏ ప్రభుత్వంతో గానీ, ఏ ప్రభుత్వ శాఖతో గానీ.. ఆంధ్రప్రదేశ్‌ లోగానీ, లేక ఇతర రాష్ట్రాల్లో గానీ ఏ రకమైన వ్యాపారం...

విష ప్రచారం ఆపకపోతే పరువు నష్టం దావా

ఏబీ తనయుడు చేతన్‌ సాయికృష్ణ స్పష్టీకరణ

అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘నేనింత వరకు ఏ ప్రభుత్వంతో గానీ, ఏ ప్రభుత్వ శాఖతో గానీ.. ఆంధ్రప్రదేశ్‌ లోగానీ, లేక ఇతర రాష్ట్రాల్లో గానీ ఏ రకమైన వ్యాపారం చేయలేదు. ఏ టెండర్‌లోను పాల్గొనలేదు. నేనిప్పటి దాకా చేసిందంతా ప్రైవేటు సెక్టార్‌లోనే. నా తండ్రిని ఉపయోగించుకుని ఏనాడూ వ్యాపారం చేయడం గానీ, లాభం పొందడం గానీ చేయలేదు’ అని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు తనయుడు చేతన్‌ సాయికృష్ణ స్పష్టం చేశారు.


ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయినందున.. జరుగుతున్న విష ప్రచారానికి సమాధానం చెప్పడానికి ఆయనకు కొన్ని పరిమితులు ఉన్నాయని, అందువల్లే ఈ విషయాలు తాను వెల్లడించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాజకీయ విషప్రచార బాధితుడినైన తన పేరును బజారుకు లాగడం ఇకనైనా ఆపాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పరువు నష్టం దావా వేయడం మినహా తనకు ఇంకో మార్గం లేదని తెలిపారు. తాను అమెరికాలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి.. అక్కడే మూడేళ్లు ఉద్యోగం చేసి.. ఇండియాలోనే స్థిరపడాలని 2017 ఏప్రిల్లో తిరిగి వచ్చానని చెప్పారు. తాను హైదరాబాద్‌లో పుట్టిపెరిగానన్నారు. ఆంధ్రప్రదేశ్‌ తన పితృభూమి అన్నారు.


ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా బతకాలనుకున్నానని.. తాను చేద్దామనుకున్న వ్యాపారానికి హైదరాబాద్‌ అనువైన చోటు అయినప్పటికీ కొత్త రాష్ట్రంలో కొంచెం ఆలస్యమైనా అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. కుటుంబానికి దగ్గరలో ఉండొచ్చనే ఉద్దేశంతో.. విజయవాడలో 2017 మే నెలలో ఒక కంపెనీని రిజిస్టర్‌ చేసి స్టార్టప్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అప్పటి నుంచి 2019 అక్టోబరు వరకు ఇతర స్టార్ట్‌పలు స్థాపించడం, కొన్నిటిలో భాగస్వామిగా ఉండడం వాస్తవమని, అయితే ఇవేవి షెల్‌ కంపెనీలు కావని స్పష్టం చేశారు. కొన్నిటిలో అవకాశాలు కనపడక, కొన్నేమో తనకు టైం లేక ఒక్కడడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. స్టార్ట్‌పలు అంటే అలాగే ఉంటాయని.. అన్నీ సక్సెస్‌ కావని, అన్నీ ముందుకూ పోవని పేర్కొన్నారు. రిటర్న్స్‌ ఫైల్‌ చేయాల్సిన కంపెనీలన్నింటికీ ఫైల్‌ చేస్తున్నానని చేతన్‌ సాయికృష్ణ తెలిపారు.
Updated Date - 2020-02-12T09:05:24+05:30 IST