దెబ్బకు దిగొచ్చిన ‘పట్టా’!

ABN , First Publish Date - 2020-11-19T08:51:47+05:30 IST

పేదింటి పట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. చట్టం అంగీకరించదని తెలిసినా, కన్వేయన్స్‌ డీడ్‌లతోనే పట్టాలు ఇవ్వాలని పట్టుబట్టి, దానిపై సుప్రీంకోర్టుకు కూడా

దెబ్బకు దిగొచ్చిన ‘పట్టా’!

‘పంచాయతీ’ ముంగిట మెట్టుదిగిన సర్కారు

పేదలకు డీపట్టాల పంపిణీకి నిర్ణయం

ముందే ఇలాచేస్తే ఎప్పుడో పేదలకు స్థలం

‘కన్వేయన్స్‌’ వాదనతో అనవసర చిక్కులు

సర్కారు తీరుతో కోర్టులకు చేరిన వివాదం

ఎన్నికల ప్రకటనతో మళ్లీ పట్టాలు తెరపైకి

డీ పట్టాల జారీకి కలెక్టర్లకు ఆదేశాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పేదింటి పట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. చట్టం అంగీకరించదని తెలిసినా, కన్వేయన్స్‌ డీడ్‌లతోనే పట్టాలు ఇవ్వాలని పట్టుబట్టి, దానిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి, చివరకు డీ పట్టాల పంపిణీకే ముందుకొచ్చింది. అనవసర పట్టుదలకు పోకుండా ఈ నిర్ణయమేదో మొదటే తీసుకొని ఉంటే, రాష్ట్రంలోని పేదలకు ఎప్పుడో ఇంటి స్థలాలు దక్కేవని ప్రభుత్వ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 25న రాష్ట్ర వ్యాప్తంగా అసైన్‌మెంట్‌ చట్టానికి లోబడి డీ-పట్టాల పంపిణీని చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. పంపిణీపై ప్రకటన చేయడం, ఏదో ఒక కారణంగా ప్రతిసారీ అది వాయిదా పడుతున్న దరిమిలా ఈసారి ఆ ముహూర్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. 


ఇదీ నేపథ్యం..

నవరత్నాలు పథకంలో భాగంగా 25 లక్షల మంది పేదలకు కన్వేయెన్స్‌ డీడ్‌ల రూపంలో ఇంటిస్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న జీవో 44 జారీ చేసింది. వీటి ఆధారంగా పట్టాలను రిజిస్ట్రేషన్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటినిర్మాణం అయ్యాక, పేదలు తమ సొంత అవసరాలకోసం ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చని వెసులుబాటు కల్పించారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ంగా ఎలాంటి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) అవసరం లేకుండానే అమ్ముకునేలా పట్టాపైనే ఆ విషయాన్ని ప్రస్తావించాలని ప్రతిపాదించారు. అయితే...  కన్వేయన్స్‌ డీడ్‌లకు చట్టం ఒప్పుకోదని ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాలు ప్రచురించింది. కేంద్ర చట్టాన్ని సవరించకుండా ‘డీడ్‌’లు కుదరదని స్పష్టం చేసింది.  ఈ అభ్యంతరాలను సర్కారు పట్టించుకోలేదు. ఈ పట్టాలను ఉగాది పండుగ రోజున పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈలోగా  జీవో 44పై  న్యాయచిక్కులు తలెత్తాయి. పేదలకిచ్చే అసైన్డ్‌ ఇంటిస్థలాలను డీ-పట్టాల రూపంలోనే ఇస్తున్నారని, కన్వేయెన్స్‌ డీడ్‌లకు చట్టబద్ధత లేదంటూ హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి.


కన్వేయెన్స్‌ డీడ్‌లకు చట్టబద్ధత ఎక్కడుంది? దీన్ని ఎలా సమర్థించుకుంటారన్న హైకోర్టు ప్రశ్నలకు రెవెన్యూశాఖ సరైన బదులివ్వకపోవడంతో ఆ జీవోను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికీ ఈ కేసుపై సుప్రీం కోర్టులో పూర్తిస్థాయి విచారణ జరగలేదు. ఇది ఎప్పటికి తేలుతుందో తెలియదు. కరోనా కారణంగా మార్చి 15న స్థానిక ఎన్నికలు కూడా వాయిదాపడ్డాయి. ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఫిబ్రవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఉంటాయని ఎస్‌ఈసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇంటిపట్టాల అంశం మరోసారి ఎజెండాలోకి వచ్చింది. కాగా, విపత్తులు, వివాదాల కారణంగా పట్టాల పంపిణీ కార్యక్రమం తొలుత ఉగాది నుంచి అంబేడ్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14కి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి జూలై 8కి, ఆగస్టు 15కి, గాంధీ జయంతి అక్టోబరు 2కు వాయిదా పడుతూ వచ్చింది. 


ముందు ఇలా కానిద్దాం..

కన్వేయెన్స్‌ డీడ్‌లపై సుప్రీంలో తేలలేదు కాబట్టి ముందు డీ-పట్టాలతోనే ఇంటిస్థలాలు ఇవ్వాలని అధికారులు సర్కారుకు సూచించారు. సుప్రీం నిర్ణయాన్ని బట్టి ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. దీంతో సర్కారు కన్వేయెన్స్‌ డీడ్‌లపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం  పేదలకు ఇంటిస్థలాలను పంపిణీ చేస్తారు. ఇందుకు లబ్ధిదారులకు డీ పట్టాలు జారీ చేయనున్నారు. 2019లో తీసుకొచ్చిన అసైన్‌మెంట్‌ చట్టసవరణ ప్రకారం ఇంటిస్థలాలను 20 ఏళ్లపాటు అమ్ముకోవడానికి వీల్లేదు. ఈ మేరకు ఆ చట్టం రూల్స్‌ను ఇటీవలే రెవెన్యూశాఖ విడుదల చేసింది. వీటినే సుప్రీం కోర్టుకు కూడా సమర్పించింది. ఈ 20 ఏళ్లపాటు వీటిని లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీల్లేదు. అయితే, ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చన్న సీఎం జగన్‌ హామీ వదులుకోవాల్సిందేనా? అని ప్రభుత్వ పెద్దలు.. రెవెన్యూశాఖను ప్రశ్నిస్తున్నారు. ’’ఎలాగూ జీవో 44 పునరుద్ధరణ కేసు సుప్రీం కోర్టులో ఉంది.  కోర్టు ఏ ఆదేశం ఇవ్వకుండానే కన్వేయెన్స్‌ డీడ్‌లు ఇవ్వలేం.


ఒకవేళ ఇచ్చాక అది చెల్లదని కోర్టు చెపితే సమస్యలొస్తాయి. కాబట్టి కోర్టు తీర్పు వచ్చేవరకు ఈ విషయంలో వేచిచూడాలి. అలా కాకుండా...ఇంటిస్థలాల పంపిణీ తప్పనిసరయితే, డీ పట్టాల రూపంలోనే ఇప్పుడు ఇవ్వాలి. సుప్రీంలో కేసు ప్రభుత్వానికి అనుకూలంగా పరిష్కారమయితే కన్వేయెన్స్‌ డీడ్‌లు ఇవ్వొచ్చు. లబ్ధిదారుల పేరిట స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయవచ్చు. సీఎం మాట నిలబడుతుంది. ఒక వేళ కోర్టు  కన్వేయెన్స్‌ డీడ్‌లు వద్దంటే ఏం చేయాల్నో తర్వాత ఆలోచించవచ్చు’’ అని రెవెన్యూశాఖ సూచించినట్లు తెలిసింది.


కాదంటే సర్కారుకే కష్టం..

ఒక వేళ డీ పట్టాలపై అధికారుల సూచన నచ్చక ఇంటిస్థలాల పంపిణీని నిరవధికంగా వాయిదావేస్తే సర్కారుకు రాజకీయంగా నష్టం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయినట్లు తెలిసింది. దీంతో  ఫిబ్రవరిలో  స్థానిక ఎన్నికల నిర్వహణ తప్పనిసరిగా ముందుకొస్తే దానికన్నా ముందే అంటే డిసెంబర్‌ నుంచే  ఇంటిపట్టాల పంపిణీ జరిగిపోవాలని ప్రభుత్వ  పెద్దలు భావిస్తున్నారు. అందుకే ఇష్టం లేకున్నా...కష్టమయినా కన్వేయెన్స్‌ డీడ్‌లపై  ప్రభుత్వ పెద్దలు  వెనక్కు తగ్గినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. ‘‘ఎన్నికలకన్నా ముందే పేదలకు ఇంటిస్థలాల పంపిణీ జరగాలి. దానికి డీ పట్టా ఇస్తారా? మరొకటా అన్నది తర్వాతి అంశం. కన్వేయెన్స్‌ డీడ్‌నే ఇవ్వాలని పట్టుబడితే ఇప్పట్లో ఇంటిస్థలాలు ఇచ్చే వీలుండదు.  ప్రభుత్వం అన్నీ బేరీజువేసుకొనే ఈనిర్ణయం తీసుకొని ఉంటుంది’’ అని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

Updated Date - 2020-11-19T08:51:47+05:30 IST