‘దేశం’దాటి అప్పులు!

ABN , First Publish Date - 2020-07-14T07:34:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల మార్గాల్లో అప్పులు సేకరిస్తూనే... ఇప్పుడు ‘ప్రైవేటు’

‘దేశం’దాటి అప్పులు!

 • అప్పులు.. తిప్పలు..
 • విదేశీ ట్రస్టు నుంచి రూ.7500 కోట్ల రుణం
 • అనుమతించాలంటూ కేంద్రానికి వినతి
 • జగన్‌ అమెరికా పర్యటన సమయంలో
 • ‘పెట్టుబడుల’పై ప్రవాసుల ఆసక్తి
 • దానినే ప్రాజెక్టుల కోసం వాడాలనే యోచన
 • అందుకు అప్పుగా తీసుకోవడమే మార్గం
 • ప్రస్తుత చట్టాల ప్రకారం అది కుదరదు
 • పార్లమెంటులో చట్ట సవరణతోనే సాధ్యం
 • నాబార్డ్‌ రుణాల వైపే కేంద్రం మొగ్గు


దేశీయంగా నాబార్డ్‌ వద్ద అప్పు తీసుకోవచ్చు.

ఆర్బీఐ ద్వారా బాండ్లు జారీ చేసి అప్పులు తీసుకోవచ్చు. 

కేంద్రం అనుమతితో విదేశీ ఆర్థిక సంస్థల నుంచీ రుణాలు సేకరించవచ్చు. 

కానీ... రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా, ఒక వినూత్నమైన ‘అప్పుల ఆలోచన’ చేస్తోంది. అది... విదేశాలకు చెందిన ప్రైవేటు ట్రస్టు నుంచి రుణం సేకరించడం!

అయితే... ఈ ప్రైవేటు ట్రస్టు ఎవరిది, ఏపీ సర్కారుకే ఎందుకు అప్పు ఇస్తానంటోంది?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల మార్గాల్లో అప్పులు సేకరిస్తూనే... ఇప్పుడు  ‘ప్రైవేటు’ రుణాలకూ ప్రయత్నం చేస్తోంది. అలా అప్పుగా తెచ్చుకున్న డబ్బులను సాగునీటి ప్రాజెక్టులు, వైద్య కళాశాలల నిర్మాణం వంటి పనులకోసం ఉపయోగిస్తారట! ఇందుకు అనుమతించాలంటూ ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అధ్యక్షతన ఒక బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి, ఇతర మంత్రులు, అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అమెరికాలోని ఒక ప్రైవేటు ట్రస్టు తమ ప్రభుత్వానికి రూ.7500 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. 


పెట్టుబడులకు బదులు అప్పులు...

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో జగన్‌  అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఆయన చాలామంది ప్రవాసాంధ్రులను కలిశారు. వీరిలో పలువురు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. ఇది నిజంగా హర్షణీయం. కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతాయి. అయితే... ‘ప్రైవేటు పెట్టుబడుల’ను ప్రభుత్వం తన సొంత అవసరాలకు, తాము అనుకున్న ప్రాజెక్టులకు వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలోనే... ట్రస్టు ఏర్పాటు, రుణ సేకరణ ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. 


ఎందుకీ ప్రైవేటు అప్పులు

రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం, ఇప్పటికే చేస్తున్న అప్పుల ద్వారా తెచ్చుకుంటున్న నిధులు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సంక్షేమం పేరిట జరుగుతున్న ‘నగదు పంపిణీ’కే సరిపోతున్నాయి. నిధుల కొరత కారణంగా ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఒక్కటీ పూర్తి చేయలేక పోయారనే విమర్శలు మోయకతప్పదు. అందుకే ‘ప్రైవేట్‌ రుణాలు’ అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. 


ఇది సాధ్యమేనా?

ఒక రాష్ట్రప్రభుత్వం నేరుగా విదేశాల నుంచి ప్రైవేటు రుణాలు తీసుకునేందుకు చట్టబద్ధమైన అవకాశం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. ఏడీబీ, జైకా వంటి అంతర్జాతీయ ఆర్థికసంస్థల నుంచి మాత్రం రుణాలు సేకరించవచ్చు. అది కూడా... కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే! ఆర్బీఐ నుంచి బాండ్లు జారీ చేసి రుణాలు సేకరించవచ్చు. అలా కాకుండా... ప్రైవేటు ట్రస్టు నుంచి రుణాలు తీసుకోవాలంటే విదేశీ పెట్టుబడుల చట్టంతోపాటు అనేక చట్టాలను సవరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 


కేంద్రం ఏం చెబుతోంది...

కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాలను ప్రోత్సహించదు. ఈ విషయం పలు సందర్భాల్లో రాష్ట్రాలకు స్పష్టం చేసింది. విదేశీ రుణాలకు బదులు దేశీయంగా అందుబాటులో ఉన్న నాబార్డ్‌ రుణాలను తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. విదేశీ రుణాలతో మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోంది. డాలర్ల రూపంలో రుణం తీసుకుని... 10 లేదా 15 ఏళ్ల తర్వాత వడ్డీతో సహా డాలర్లలోనే చెల్లించాల్సి ఉంది. పడిపోతున్న రూపాయి విలువతో పోల్చితే... ఇది విపరీతమైన భారం. ఉదాహరణకు... పదేళ్ల ఏళ్ల క్రితం డాలర్‌ మారకం 45 రూపాయలు ఉన్నప్పుడు విదేశాల నుంచి ఈఏపీల కోసం తీసుకున్న రుణాలను ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు... డాలర్‌ మారకం విలువ  రూ.75కు పెరిగింది. అంటే... అసలులోనే తీసుకున్న రుణానికి దాదాపు 40 శాతం ఎక్కువ కడుతున్నామన్న మాట. ఇందుకు వడ్డీ అదనం. అదే నాబార్డ్‌లాంటి దేశీ రుణాలకు ఈ సమస్య ఉండదు.


రూపాయల్లో తీసుకుని రూపాయల్లో చెల్లిస్తారు. పైగా ప్రాజెక్టు కాలంలో ముడి సరుకుల ధరల పెరుగుదలను కూడా అంచనా వేసి నాబార్డ్‌ రుణాలు ఇస్తుంది.  కాబట్టి ఇది రాష్ట్రాలకు లాభించే అంశమని కేంద్రం వాదన. అయినప్పటికీ రుణం మంజూరు సమయంలో ఆ సంస్థ ప్రాజెక్టుకు సంబంధించి అడిగే వివరాలు సమర్పించలేక నాబార్డు రుణాలకు రాష్ట్రాలు వెనకడుగు వేస్తుంటాయి. ఇప్పుడు ఏపీ సర్కారు ఏకంగా ‘విదేశీ ప్రైవేటు రుణాలు’ అనే కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.

Updated Date - 2020-07-14T07:34:45+05:30 IST