‘ఎథెనా’ కొంటే మునిగిపోతాం!

ABN , First Publish Date - 2020-04-24T08:04:33+05:30 IST

ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని ఎథెనా థర్మల్‌ విద్యుత్కేంద్రం కొనుగోలు చేస్తే మునిగిపోతామని రాష్ట్ర విద్యుత్‌ ఇంజనీర్ల సంఘం హెచ్చరించింది. దీని కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం ముందడుగు వేస్తున్న దశలో...

‘ఎథెనా’ కొంటే  మునిగిపోతాం!

  • రాష్ట్ర విద్యుత్‌ రంగానికి తీరని నష్టం
  • ఆ ప్లాంటుకు సరైన బొగ్గు లింకేజీలు లేవు
  • ఇంకా నిర్మాణమే పూర్తికాలేదు
  • రాష్ట్ర ఇంజనీర్ల సంఘం ఆక్షేపణ
  • ఇంధన శాఖ కార్యదర్శికి సవివర లేఖ

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని ఎథెనా థర్మల్‌ విద్యుత్కేంద్రం కొనుగోలు చేస్తే మునిగిపోతామని రాష్ట్ర విద్యుత్‌ ఇంజనీర్ల సంఘం హెచ్చరించింది. దీని కొనుగోలుకు రాష్ట్రప్రభుత్వం ముందడుగు వేస్తున్న దశలో.. ఇందులో ఇమిడి ఉన్న ఆర్థిక, సాంకేతిక సమస్యలను ఎత్తిచూపిస్తూ ఏపీఎ్‌సఈబీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల సంఘం గురువారం ఐదు పేజీల సవివర లేఖను ఇంధన శాఖ కార్యదర్శికి పంపింది. 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటుకు సరైన బొగ్గు లింకేజీలు లేవని.. ఇంకా నిర్మాణం కూడా పూర్తికాని ఈ ప్లాంటును ఏపీజెన్‌కో ద్వారా కొనుగోలు చేయిస్తే.. అది జెన్‌కోకు, రాష్ట్ర విద్యుత్‌ రంగానికి నష్టదాయకంగా పరిణమిస్తుందని అందులో పేర్కొంది. ‘చైనా తయారీ బాయిలర్లు, పరికరాలు వాడారన్న కారణంతో దీనిని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ ఒప్పుకోలేదు. 


జెన్‌కో పాలకమండలి కూడా దీని కొనుగోలు ప్రతిపాదనను గతంలో తిరస్కరించింది. కానీ ఇప్పుడు కొన్ని బయటి శక్తుల ప్రమేయంతో మళ్లీ అదే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. కేవలం అక్కడ ఉత్పత్తి ఖర్చుతో పాటు మిగిలిన ఖర్చులను కూడా కలిపితే గాని అసలు ఖర్చు తేలదు’ అని స్పష్టం చేశారు.మన రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం ఇప్పుడు 8 వేల నుంచి 10 వేల మెగావాట్ల మధ్య ఉందని, కానీ ఇప్పటికే మన రాష్ట్ర విద్యుత్‌ గ్రిడ్‌కు 19 వేల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం అనుసంధానమై ఉందని ఇంజనీర్ల సంఘం తన లేఖలో గుర్తుచేసింది. ‘ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌ ప్లాంటులో యూనిట్‌ కరెంటు రూ.3.80కే వస్తుందని, బాగా తక్కువ ధరని చెబుతున్నారు. కానీ


ఆ ప్లాంటు 95 శాతం సామర్థ్యంతో పనిచేస్తేనే ఈ ధర పడుతుంది. కొత్తగా 1,200 మెగావాట్ల ఛత్తీ్‌సగఢ్‌ ప్లాంటును కొంటే ఆ విద్యుత్‌ను గ్రిడ్‌ తీసుకోలేదు. తీసుకోవాలంటే ఇప్పటికే ఉన్న ఏదైనా థర్మల్‌ ప్లాంటును నిలిపివేయాలి. ఒప్పందంలో ఉన్న ప్లాంటును నిలిపివేసినా దానికి స్థిర చార్జీలను విద్యుత్‌సంస్థలకు చెల్లించాల్సిందే. అది కూడా కలుపుకొంటే ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్‌ ధర రూ.6 పైనే పడుతుంది. దాని బదులు జెన్‌కో ఆధ్వర్యంలో ఉన్న థర్మల్‌ ప్లాంట్లను 80 శాతం సామర్థ్యంతో పనిచేయించుకుంటే అదే విద్యుత్‌ రూ.4కే వస్తుంది’ అని స్పష్టం చేశారు.


Updated Date - 2020-04-24T08:04:33+05:30 IST