-
-
Home » Andhra Pradesh » State Education Minister Adimulpu Suresh
-
9న ‘అమ్మఒడి’
ABN , First Publish Date - 2020-12-15T09:29:22+05:30 IST
9న ‘అమ్మఒడి’

రేపు సచివాలయాల్లో అర్హుల జాబితాల ప్రదర్శన
షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత ఆర్థిక సాయాన్ని సీఎం జగన్ చేతుల మీదుగా జనవరి 9న అందివ్వనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరానికి అమ్మఒడి షెడ్యూల్‌ను సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులకు వెల్లడించారు. పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్లు నమోదు ఈ నెల 10వ తేదీనే ప్రారంభమైందని, ఈ నెల 16న అర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శనకు పెడతామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్ అన్‌ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్, రేషన్‌కార్డు జిరాక్స్ కాపీలు అందజేయాలన్నారు. మొదటి విడతగా 43,54,600పైగా లబ్ధిదారులకు రూ.6,336 కోట్లు అందజేశామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, కుల, మత ప్రాంతాలకు అతీతంగా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. 27, 28 తేదీల్లో గ్రామ వార్డు సభల్లో తుది జాబితాలకు ఆమోదం తెలుపుతారని, 30న తుది జాబితాలకు జిల్లా కలెక్టర్లు ఆమోదం తెలుపుతారని చెప్పారు.
పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు..
ఉపాధ్యాయ బదిలీలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఉపాధ్యాయుల ఖాళీలను బ్లాక్ చేశారని, ఇప్పుడు బ్లాక్ చేయడం కొత్తకాదన్నారు. తాము బ్లాక్ చేసిన ఖాళీల వివరాలు ప్రతి జిల్లా డీఈవో కార్యాలయంలో ప్రదర్శిస్తున్నామని, వెబ్‌సైట్‌లోనూ పెట్టామన్నారు.