కారణాలు వెలికితీస్తాం

ABN , First Publish Date - 2020-05-08T10:40:55+05:30 IST

గ్యాస్‌ లీక్‌ ఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

కారణాలు వెలికితీస్తాం

ప్రమాదమో, నిర్లక్ష్యమో ఇప్పుడే చెప్పలేం : డీజీపీ


అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ లీక్‌ ఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనకు కారణం ప్రమాదమో, నిర్లక్ష్యమో ఇప్పుడే చెప్పలేమన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని విజయవాడలో ఆయన తెలిపారు. వేకువజామున విషవాయువుతో ఇబ్బంది పడిన ప్రజల నుంచి డయల్‌ 100కు ఫోన్‌ వచ్చిందన్నారు. పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకున్నారని, కొన్ని నిమిషాల్లోనే పోలీస్‌ కమిషనర్‌ ఇతర అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారని వివరించారు. దగ్గర్లోని ఇతర పోలీసు స్టేషన్లతోపాటు ఏపీఎస్పీ బలగాలను రంగంలోకి దించి అస్వస్థతకు గురైన వారిని వెంటవెంటనే అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు.


వీలైనంత వరకూ ప్రాణనష్టం నివారించేందుకే మొదటి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అదే సమయంలో పరిశ్రమకు పరిసర గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ విశాఖ పోలీసులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశామని, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సకాలంలో పోలీసులకు మద్దతుగా నిలిచి అద్భుతంగా పనిచేశాయని ఆయన కొనియాడారు. తీవ్ర అస్వస్థతకు గురైన వందలాది మందిని అత్యంత వేగంగా ఆస్పత్రులకు తరలిస్తూ... మరోవైపు నీరు తాగించడం, ముఖంపై జల్లడం, తడివస్త్రం ముఖానికి చుట్టడం లాంటివి చేశారని వివరించారు. 

Updated Date - 2020-05-08T10:40:55+05:30 IST