ఆర్డినెన్స్‌ రూపంలో రాష్ట్ర బడ్జెట్‌!

ABN , First Publish Date - 2020-03-25T08:04:35+05:30 IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ జారీచేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం...

ఆర్డినెన్స్‌ రూపంలో రాష్ట్ర బడ్జెట్‌!

  • గతంలోనూ రెండుసార్లు ఇలాగే


అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి రాష్ట్ర బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ జారీచేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయం రాజకీయ, అధికార వర్గాల్లో నెలకొంది. బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తే ఎమ్మెల్యేలు, వారి సహాయకులు.. అధికారులు, వారి సహాయకులు, అసెంబ్లీ సిబ్బంది, భద్రతా  సిబ్బంది.. ఇలా పలు విభాగాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో హాజరు కావలసి ఉంటుంది. అంటే జనం గుమికూడడమే! కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఇది వాంఛనీయం కాదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సాధారణంగా మార్చినాటికి బడ్జెట్‌ సమావేశాలు జరుగుతూ ఉండాలి. కానీ స్థానిక ఎన్నికల కారణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలకు బదులు ఈ నెలాఖరులో ఓటాన్‌  అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను ఒకట్రెండు రోజుల పాటు నిర్వహించాలని తొలుత అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో అది కూడా జరిపే పరిస్థితి కనిపించడం లేదు.


ఈ దృష్ట్యా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తెచ్చే అవకాశం ఉందంటున్నారు. గతంలోనూ మన రాష్ట్రంలోనే రెండుసార్లు ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను తీసుకొచ్చారు. 2004లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరిపే వీలు లేకుండా పోయింది. ఆ సందర్భంలో ఆర్డినెన్స్‌ ద్వారా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను తెచ్చారు. తర్వాత 2014లో రాష్ట్ర విభజన సమయంలో కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. అప్పుడు శాసనసభ సమావేశాలు జరగకపోవడంతో ఆర్డినెన్స్‌ ద్వారానే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను తీసుకొచ్చారు. ఇప్పుడు కరోనా వైరస్‌ నేపథ్యంలో మళ్లీ అదే పని చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-03-25T08:04:35+05:30 IST