సర్వభూపాల వాహనంపై శ్రీవారు
ABN , First Publish Date - 2020-10-24T08:23:39+05:30 IST
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి సర్వభూపాల, అశ్వవాహనాలపై దర్శనమిచ్చారు.

తిరుమల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి సర్వభూపాల, అశ్వవాహనాలపై దర్శనమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవరోజు స్వర్ణ రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది కొవిడ్ ప్రభావంతో ఆలయంలోనే వాహనసేవలను ఏకాంతంగా నిర్వహిస్తుండటంతో స్వర్ణరథానికి బదులుగా సర్వభూపాల వాహన సేవ నిర్వహించారు.
స్వర్ణరథం తరహాలోనే సర్వభూపాల వాహనాన్ని తయారుచేసి, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని కొలువుదీర్చి వాహనసేవ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవను వైభవంగా నిర్వహించారు. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలన్నీ పూర్తయ్యాయి. శనివారం ఉదయం చక్రస్నానం నిర్వహించడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా తిరుమలలో విజయదశమి పార్వేట ఉత్సవం ఆదివారం ఏకాంతంగా జరగనుంది.