మరో మూడువేల మందికి శ్రీవారి దర్శనం

ABN , First Publish Date - 2020-06-26T08:27:38+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు మరికొంతమంది భక్తులకు టీటీడీ అవకాశం కల్పించింది.

మరో మూడువేల మందికి శ్రీవారి దర్శనం

తిరుమల, జూన్‌ 25: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు మరికొంతమంది భక్తులకు టీటీడీ అవకాశం కల్పించింది. గురువారం నుంచి జూన్‌ 30వ తేదీ వరకు రోజుకు అదనంగా మరో మూడువేల మందికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 8.30 గంటలకు విడుదల చేసింది. దీంతో బుధవారం వరకు శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 9,750 ఉండగా.. గురువారం నుంచి దాదాపు 13 వేలకు చేరింది. ప్రభుత్వ అనుమతులతో లాక్‌డౌన్‌ తర్వాత జూన్‌ 11వ తేదీ నుంచి టీటీడీ శ్రీవారి దర్శనాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలుత ఆన్‌లైన్‌ ద్వారా రోజుకు 3వేల చొప్పున ఈ నెల 30వ తేదీ వరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను 8వ తేదీన విడుదల చేయగా ఒక్కరోజులోనే అన్ని టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు.


మరోవైపు ఈ నెల 26వ తేదీ వరకు రోజుకు మరో 3,750 చొప్పున స్లాటెడ్‌ సర్వదర్శనం (ఎస్‌ఎ్‌సడీ) టోకెన్లను తిరుపతిలోని కౌంటర్లలో భక్తులకు కేటాయించారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను మినహాయిస్తే రోజుకు 6,750 మందికి శ్రీవారి దర్శనం చేయిస్తూవచ్చారు. క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో పాటు భక్తులు నిబంధనలు పాటిస్తూ భౌతికదూరంతో శ్రీవారిని దర్శించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో భక్తుల సంఖ్యను పెంచాలని భావించిన టీటీడీ.. 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రోజుకు అదనంగా 3వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిది. అప్పటి నుంచి బుధవారం వరకు రోజుకు 9,750 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూ వచ్చారు.

Updated Date - 2020-06-26T08:27:38+05:30 IST