రామ్మోహన్‌ నాయుడుకు ‘సంసద్‌ రత్న’ అవార్డు

ABN , First Publish Date - 2020-06-25T07:54:45+05:30 IST

పార్లమెంటులో మంచి పనితీరు కనబరిచిన ఎంపీలకు ఇచ్చే ‘సంసద్‌ రత్న’ అవార్డు శ్రీకాకుళం ..

రామ్మోహన్‌ నాయుడుకు  ‘సంసద్‌ రత్న’ అవార్డు

పిన్న వయసులో రికార్డ్‌ సాధించిన శ్రీకాకుళం ఎంపీ


అమరావతి/న్యూఢిల్లీ/శ్రీకాకుళం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో మంచి పనితీరు కనబరిచిన ఎంపీలకు ఇచ్చే ‘సంసద్‌ రత్న’ అవార్డు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు(టీడీపీ)ను వరించింది. పిన్న వయసులో ఈ అవార్డు పొందిన పార్లమెంటు సభ్యునిగా ఆయన రికార్డు సృష్టించారు. 2020 సంవత్సరానికి సంబంధించి ‘ప్రైమ్‌ పాయింట్‌ ఫౌండేషన్‌’ సంస్థ ఈ అవార్డులను ప్రకటించింది. పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు తమ విధి నిర్వహణ, ప్రసంగాలలో చూపించే ప్రతిభ, సమర్ధత, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ సంస్థ ఏటా అవార్డులను ప్రకటిస్తుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ అధ్యక్షతన ఏర్పాటైన ముగ్గురు సభ్యుల జ్యూరీ ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది.


2019-20 సంవత్సరానికి సంబంధించి జరిగిన ఎంపికలో శశిధరూర్‌, సుప్రియా సూలే వంటి సీనియర్‌ ఎంపీలు కూడా ఉన్నారు. జ్యూరీ కమిటీ స్పెషల్‌ అవార్డు కింద రామ్మోహన్‌ నాయుడును ఎంపిక చేసింది. గత ఐదేళ్లుగా శ్రీకాకుళం జిల్లా ప్రజల కోసం చేసిన కృషికి ఇది గుర్తింపని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు వ్యాఖ్యానించారు. తన పనితీరు నచ్చి శ్రీకాకుళం ప్రజలు రెండోసారి కూడా ఎంపీగా గెలిపించారని, ఈ అవార్డు వారికే అంకితమని పేర్కొన్నారు. కాగా, సంసద్‌ రత్న పురస్కారం పొందిన రామ్మోహన్‌ నాయుడును టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. 

Updated Date - 2020-06-25T07:54:45+05:30 IST