పసిగుడ్డును చిదిమేశాడు!

ABN , First Publish Date - 2020-12-07T08:55:36+05:30 IST

భార్యపై అనుమానంతో కన్న కొడుకునే కడతేర్చాడు. 18 నెలల చిన్నారి తలపై టీవీ రిమోట్‌తో కొట్టి చంపేశాడు.

పసిగుడ్డును చిదిమేశాడు!

భార్యపై అనుమానంతో కొడుకును చంపేశాడు

మాచవరంలో దారుణం


నాగులుప్పలపాడు, డిసెంబరు 6 : భార్యపై అనుమానంతో కన్న కొడుకునే కడతేర్చాడు. 18 నెలల చిన్నారి తలపై టీవీ రిమోట్‌తో కొట్టి చంపేశాడు. ఈ హృదయవిదారక సంఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన జాన్‌ కెన్నీ మాచవరంలోని హెల్ప్‌ హోంలో పెరిగాడు. అదే హోంలో ఉండే కాకినాడకు చెందిన గుత్తుల చంద్రావతిని 2015లో ప్రేమపెళ్లి చేసుకున్నాడు. అనంతరం.. మాచవరంలోనే అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. వారికి మూడేళ్ల కుమార్తె జోష్‌ ఏంజెల్‌, కుమారుడు జోయల్‌ (14నెలలు) ఉన్నారు. ఉప్పుగుండూరులోని ఓ స్వీట్‌ షాపులో పనిచేసే కెన్నీ.. కుమారుడు పుట్టినప్పటి నుంచి భార్యపె అనుమానం పెంచుకున్నాడు. ఆ బిడ్డ తనకు పుట్టలేదంటూ ఆమెను నిత్యం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం మంచంపై పడుకొని ఉన్న చిన్నారి జోయల్‌ తలపై టీవీ రిమోట్‌తో బలంగా మోదాడు. తీవ్రగాయాలైన జోయల్‌ను స్థానికులు ఒంగోలు రిమ్స్‌కు, తర్వాత గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జోయల్‌ మృతి చెందాడు. ఆదివారం రూరల్‌ సీఐ సుబ్బారావు, ఇన్‌చార్జి ఎస్సై రాజారావు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-12-07T08:55:36+05:30 IST