భౌతిక దూరం పాటించకపోతే పట్టించేస్తుంది
ABN , First Publish Date - 2020-06-18T10:21:55+05:30 IST
తిరుమలలో భక్తులు భౌతికదూరం పాటించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.

- టెక్నాలజీతో ముందుకెళ్తున్న టీటీడీ
తిరుమల, జూన్ 17: తిరుమలలో భక్తులు భౌతికదూరం పాటించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. భక్తులు భౌతికదూరం నిబంధనను అతిక్రమిస్తే వెంటనే సిబ్బందికి సమాచారం చేరవేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో సీసీ కెమెరాలకు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. టీటీడీ సీవీఎస్వో గోపినాథ్ ఈ విధానంపై ప్రత్యేక దృష్టి సారించారు. భౌతికదూరం లేకపోతే అలర్ట్ ఇచ్చేలా ముఖ్యమైన ప్రాంతాల్లో అమర్చిన 8 కెమెరాలకు ‘సోషల్‌డిస్టెన్స్’ సాఫ్ట్‌వేర్‌ను జత చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్‌ల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
ఎవరైనా భౌతికదూరం పాటించకపోతే దగ్గర్లోని సిబ్బందికి సమాచారమిస్తారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తిరుమలలో 1,700 సీసీ కెమెరాలున్నాయి. కమాండ్ కంట్రోల్‌రూమ్ ద్వారా వీటిని పరిశీలిస్తుంటారు. ‘ఫేస్ రికగ్నిషన్’ సాఫ్ట్‌వేర్‌ను 20 కెమెరాలకు అనుసంధానం చేశారు. పాత నేరస్థులు, దళారీలు, హైటెక్ బెగ్గర్లను గుర్తించే వీలుంటుంది. జంతువులు రోడ్లపైకి వచ్చినప్పడు అలర్ట్ చేసేలా ‘జోన్ ఇంట్రూషన్’ సాఫ్ట్‌వేర్‌తో 38 కెమెరాలు వినియోగిస్తున్నారు. కాగా, ‘వెహికల్ కౌంట్-నంబర్‌ప్లేట్ ఐడింటిఫికేషన్’ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తూ తిరుమలకు ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వెళుతున్నాయనే సమాచారం తెలుసుకుంటున్నారు. అగ్నిప్రమాదాలు జరిగితే సమాచారం చేరవేసేలా మరో ఆరు కెమెరాలకు ‘ఫైర్ అండ్ స్మోక్’ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు.