మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి ప్రత్యేక విభాగం

ABN , First Publish Date - 2020-05-09T09:57:06+05:30 IST

రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు.

మద్యం, ఇసుక అక్రమాల  నిరోధానికి ప్రత్యేక విభాగం

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. మూడు రోజులక్రితం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తుదిరూపం తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం  అఽధికారులతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో మద్య నియంత్రణ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నందున పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా, రాష్ట్రంలోనూ అక్రమ తయారీ జరిగే అవకాశాలున్నాయని అధికారులను సీఎం హెచ్చరించారు. మద్య నిషేధంలో భాగంగానే 75 శాతం మేర ధరలు పెంచామన్నారు.అధికారంలోకి వచ్చాక 33 శాతం షాపులను తగ్గించామనీ, భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామనీ సీఎం స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రావాణా జరగకూడదని తేల్చి చెప్పారు.


ఈ రెంటినీ సమన్వయం చేసుకొంటూ సమర్థవతంగా పనిచేయడానికే ప్రత్యేక బ్యూరో అని సీఎం వివరించారు. ఇప్పటి వరకూ ఉన్న డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రొహిబిషన్‌ స్థానంలో... కమిషనర్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (లిక్కర్‌ అండ్‌ శాండ్‌) ఏర్పాటు కానున్నది. ఇంటెలిజెన్స్‌, ఏసీబీ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తరహాలోనే ఈ బ్యూరో కూడా స్వతంత్య్రంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున లైసెన్సులు, స్టాకు, విక్రయాలు, ఉత్పత్తి వంటి రోజువారీ పాలనాంశాలను మాత్రమే ఎక్సైజ్‌ కమిషనర్‌ చూసుకుంటారు. ఎక్సైజ్‌ శాఖలోని అధికభాగం సిబ్బంది కొత్తగా ఏర్పాటయ్యే బ్యూరో కిందకు వస్తారు. జిల్లాలో ఒక్కో ఏఎస్పీ కింద కనీసం 20 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు. జిల్లా ఎస్పీలతో వీరు సమన్వయం చేసుకుంటారు. అక్రమ రవాణాకు ఎక్కువ ఆస్కారం ఉన్న సరిహద్దు జిల్లాల్లో  ఈ బ్యూరోకి ఐపీఎస్‌ స్థాయి అధికారిని నియమిస్తారు. ఈ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉండేలా నిబంధనల్లో మార్పులూ చేర్పులూ చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-05-09T09:57:06+05:30 IST