ఎస్‌ఈసీకి విశేషాధికారాలు

ABN , First Publish Date - 2020-03-16T09:24:25+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వాయిదా వేయడంపై అధికార పార్టీ కన్నెర్ర చేస్తోంది. తమకు ఒక్కమాట కూడా చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారంటూ

ఎస్‌ఈసీకి విశేషాధికారాలు

  • కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమానంగా అధికారం 
  • అభిశంసన బిల్లుతోనే ఎస్‌ఈసీ తొలగింపు సాధ్యం


అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వాయిదా వేయడంపై అధికార పార్టీ కన్నెర్ర చేస్తోంది. తమకు ఒక్కమాట కూడా చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారంటూ ఎస్‌ఈసీ చర్యలను సీఎం జగన్‌ ఖండించారు. ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీలను తప్పించాలని సూచించడాన్ని సైతం తప్పుబట్టిన ఆయన ఎస్‌ఈసీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. దీనికి స్పందనగా రమేశ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికల కమిషర్‌కు ఉంటాయని, ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశామని, రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉండే అధికారాలేంటి?, దాని పరిధి ఎంత అనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను 1994 సెప్టెంబరులో రాజ్యాంగంలోని 243కే, 243 జెడ్‌(ఏ) అధికరణల కింద ఏర్పాటు చేశారు.


దీనిప్రకారం ఎన్నికల జాబితాను రూపొందించేందుకు ఆదేశించడం, పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ బాధ్యత. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉన్నట్లుగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా అధికారాలుంటాయి. అసెంబ్లీ, పార్లమెంట్‌ సభ్యుల ఎన్నికలు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తే, స్థానికసంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్వహిస్తుంది. ఎస్‌ఈసీని గవర్నర్‌ నియమించినా ఆయన్ను తొలగించాలంటే మాత్రం అభిశంసన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీతో తొలగిస్తూ బిల్లుపెట్టి దానిని గవర్నర్‌ ఆమోదంతో కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర హోం, న్యాయశాఖలు దానిపై సమీక్షించి ఆమోదిస్తేనే ఎస్‌ఈసీ పదవీచ్యుతుడవుతారు. ఎస్‌ఈసీ అభిశంసించాలని రాష్ట్ర ప్రభు త్వం భావించినా... కేంద్రం అందుకు ఒప్పుకునే పరిస్థితి ఉండదంటున్నారు. కేంద్ర అధికారుల సూచనలతోనే నిర్ణయం తీసుకున్నందున రమేశ్‌కుమార్‌ను అభిశంసిస్తూ కేంద్రానికి బిల్లు పంపినా పట్టించుకోబోరని పేర్కొంటున్నారు.

Updated Date - 2020-03-16T09:24:25+05:30 IST