స్పీకర్, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-10-08T19:52:38+05:30 IST
మీడియా, సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై గురువారం హైకోర్టులో విచారణ జరుగుతోంది.

అమరావతి: మీడియా, సోషల్ మీడియాలో వ్యాఖ్యలపై గురువారం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా విభాగం వ్యాఖ్యలపై విచారణ జరుగుతోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు నందిగం సురేష్, విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు మీడియా, సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. వైసీపీ నేతల వ్యాఖ్యలు కోర్టులపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. వ్యాఖ్యలు చేసిన నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు పోలీసులను ఉద్దేశించి ప్రశ్నించింది. ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నారని, జడ్జిలు, కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు లేవని న్యాయస్థానం ప్రశ్నించింది. రిజిస్ట్రార్ కేసు దాఖలు చేసినా పదవిలో ఉన్నవాళ్లపై కేసులు ఎందుకు పెట్టలేదు?.. నేతలను రక్షించేందుకే కేసు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.