ఉత్తరాంధ్ర నుంచి నైరుతి నిష్క్రమణ

ABN , First Publish Date - 2020-10-27T09:12:02+05:30 IST

నైరుతి రుతుపవనాలు సోమవారం ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ నుంచి నిష్క్రమించాయి.

ఉత్తరాంధ్ర నుంచి  నైరుతి నిష్క్రమణ

రేపే ఈశాన్య రుతుపవనాల ఆగమనం


విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు సోమవారం ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ నుంచి నిష్క్రమించాయి. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమతోపాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తవుతుంది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్రను అనుకుని ఉన్న కర్ణాటక, కేరళల్లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు 28న ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈశాన్య, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల వరకు విస్తరించింది. అక్కడి నుంచి దక్షిణ తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడులో పలుచోట్ల భారీవర్షాలు, రాయలసీమ, కోస్తాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈనెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగనుందని, అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2020-10-27T09:12:02+05:30 IST