శభాష్‌ సోనూసూద్‌!

ABN , First Publish Date - 2020-07-27T07:50:27+05:30 IST

తెరపైన ‘బొమ్మాళీ నిన్ను వదల’ అని భయపెట్టిన విలన్‌! నిజ జీవితంలో మాత్రం... సాటి మనుషుల కష్టాలపై చలించి, సాయం అందించే హీరో! ఆయనే...

శభాష్‌   సోనూసూద్‌!

రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ కానుక

కదిలించిన రైతు కూతుళ్ల కష్టం

మాటిచ్చిన 24 గంటల్లోనే 

నెరవేర్చిన నటుడు

వారిని చదివిస్తా: చంద్రబాబు



కేవీ పల్లె, జూలై 26: తెరపైన  ‘బొమ్మాళీ నిన్ను వదల’ అని భయపెట్టిన విలన్‌! నిజ జీవితంలో మాత్రం... సాటి మనుషుల కష్టాలపై చలించి, సాయం అందించే హీరో! ఆయనే... సోనూసూద్‌! కరోనా లాక్‌డౌన్‌తో కష్టాలు పడుతున్న వలస జీవులను ఆదుకున్న ఈ నటుడు... తాజాగా మరో రైతు కుటుంబానికి బాసటగా నిలిచారు. జోడెద్దులను అద్దెకు తెచ్చుకోలేని పరిస్థితుల్లో... బాలికలే కాడి పట్టిన సంగతి తెలుసుకుని చలించిపోయారు. వారికి ట్రాక్టర్‌ను కానుకగా పంపించారు. ఆదివారం ఉదయం ప్రకటించిన బహుమానం... సాయంత్రానికే ఇంటిముందుకు రావడంతో దళిత రైతు కుటుంబం ఆనందానికి అవధులే లేవు. చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మహల్‌రాజుపల్లెకు చెందిన వీరదుల్లు నాగేశ్వరరావు ఉపాధి నిమిత్తం మదనపల్లెలో టీ అంగడి నడుపుతున్నారు.ఈయన కుమార్తెలు వెన్నెల ఇంటర్‌, చందన పదో తరగతి పాసయ్యారు. నాగేశ్వరరావు కరోనా లాక్‌డౌన్‌తో కుటుంబాన్ని తీసుకుని స్వగ్రామానికి వచ్చేశారు. ఆయనకు రెండెకరాల వర్షాధార భూమి ఉంది. ఈసారి అదునుకు వర్షం పడ్డా వేరుశనగ విత్తేందుకు కూలీలు, నాగళ్లు దొరక్క కుదరలేదు. సొంతంగా ఎద్దులూ లేవు. అదును మించిపోతుండటంతో కనీసం కంది వేద్దామని భావించారు. అయితే, నాగలితో దున్నడానికి రూ.రెండు వేలు అడిగారు. తండ్రి ప్రయత్నాలను గమనిస్తున్న కుమార్తెలు మేమున్నాం... అని ముందుకు వచ్చారు. కాడిని చెరో పక్క పట్టుకుని లాగారు. తండ్రి మేడిపట్టగా... తల్లి విత్తనాలు చల్లింది. తమ కష్టం నలుగురికీ తెలియాలని, మరో నలుగురికి స్ఫూర్తిగా నిలవాలని ఈ దృశ్యాలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు.


ఈ విషయం సోనూ సూద్‌ దాకా వెళ్లింది. ఆయన వెంటనే స్పందించారు. ‘‘మీరు చదువుకోండి. రేపటికల్లా కాడెద్దులు మీ గుమ్మం ముందుంటాయి’’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత... ‘ఎద్దులు కాదు... మీ కుటుంబానికి ట్రాక్టరే కావాలి. ఈరోజు సాయంత్రానికల్లా మీ పొలంలో ట్రాక్టర్‌ ఉంటుంది’’ అని మరో ట్వీట్‌ చేశారు. చెప్పినట్లుగానే... ఆదివారం సాయంత్రమే రూ.8.5 లక్షల విలువైన సోనాలికా ట్రాక్టర్‌ నాగేశ్వరరావు ఇంటి ముందు నిలిచింది. బెంగళూరు నుంచి వచ్చిన సోనూసూద్‌ ప్రతినిధులు వరుణ్‌ కుమార్‌ రెడ్డి, శేషునాథ రెడ్డి ట్రాక్టర్‌తోపాటు వ్యవసాయ పరికరాలు, రూ.5వేల నగదు అందించారు. ‘మీ చదువు నిర్విఘ్నంగా కొనసాగించండి. ఇది సోనూ సూద్‌ ఆకాంక్ష’ అని వెన్నెల, చందనకు చెప్పారు. తన బిడ్డల కాయకష్టం ఇంత మందిని కదిలిస్తుందని ఊహించలేదని నాగేశ్వరరావు దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు.  వారిని ఉన్నత చదువులు చదివిస్తామని చెప్పారు. సోనూసూద్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మనసున్న సోనూ సూద్‌ చల్లగా ఉండాలని కోరుకున్నారు.


మేం చదివిస్తాం: చంద్రబాబు

రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ అందించిన సోనూ సూద్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్‌ చేసి అభినందించారు. ఆయన స్పందన స్ఫూర్తిదాయకం అన్నారు. రైతు కుమార్తెలను చదివించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని తెలిపారు. సోనూసూద్‌ను లోకేశ్‌ కూడా అభినందించారు.

Updated Date - 2020-07-27T07:50:27+05:30 IST