సీఎం జగన్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ

ABN , First Publish Date - 2020-09-07T00:59:32+05:30 IST

సీఎం జగన్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ

సీఎం జగన్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ

అమరావతి: సిఎం జగన్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని ప్రఖ్యాతి గాంచిన అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని రథం అగ్నికి ఆహుతి కావటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఏటా జరిగే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాల సమయంలో స్వామి వారి రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు.


రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా రాష్ట్రతర ప్రాంతాల నుండి, ఏదేశాల నుండి కూడా అంతర్వేది ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారని లేఖలో పేర్కొన్నారు. తరతరాలుగా ఈ రథోత్సవానికి గల ప్రాధాన్యతను గుర్తించిన ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు 1958లో ఈ భారీ రథాన్ని తయారు చేయించారని చెప్పారు.


గత 62 సంవత్సరాలుగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సేవలో ఈ రథం తరిస్తోందన్నారు. అటువంటి రథం దగ్ధం కావడం లక్షలాది మంది భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మనోభావాలు దెబ్బ తినే రీతిలో రథం దగ్ధం అయ్యిందని లేఖలో పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ దగ్ధం అయ్యిందా? లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడ్డారా అనేది స్పష్టం కావలసి ఉందన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలనీ, శాఖాపరమైన శాఖాపరమైన నిర్లక్ష్యమైతే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా సూచించారు.


గతంలో చిత్తూరు జిల్లా బిట్రగుంట వెంకటేశ్వర స్వామి వారి రధాన్ని తగలబెట్టారని గుర్తుచేశారు. రధం విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇవన్నీ మతిస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారని చెబుతున్నారని పేర్కొన్నారు. పిఠాపురంలో పదుల సంఖ్యలో దేవతా విగ్రహాలు పగల కొట్టిన కేసులో మతిస్థిమితం లేని వాళ్లు చేశారని కేసు కొట్టేశారని చెప్పారు. పైన తెలిపిన ఘటనలపై హైకోర్టు సిట్టింగ్ జడ్డిచే విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-07T00:59:32+05:30 IST