ఏపీలో మోదీయిజంను స్థాపించటమే లక్ష్యం: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-08-12T00:46:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో మోదీయిజం ను స్థాపించటమే బీజేపీ లక్ష్యం అని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి

ఏపీలో మోదీయిజంను స్థాపించటమే లక్ష్యం: సోము వీర్రాజు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో మోదీయిజం ను స్థాపించటమే బీజేపీ లక్ష్యం అని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి ముందుకు వెళ్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసగించారు. రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని బీజేపీ-జనసేన సంయుక్త వ్యూహం ఖరారు చేశాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని అన్నారు.


రెండు కుటుంబ పార్టీల మధ్య ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోందని వీర్రాజు వ్యాఖ్యానించారు. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య బీజేపీకి అవకాశం లేదనే వాదన సరికాదన్నారు. సామాజిక సమతుల్యం అంటారు కానీ, ఎవరికీ అధికారాలు ఇవ్వరని వైసీపీ, టీడీపీని ఉద్దేశించి వీర్రాజు విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఉన్న హోం మంత్రి ఒక డీఎస్పీని బదిలీ చేయగలరా? అని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పరిపాలనే ఉంటుందని దుయ్యబట్టారు. అది తమిళనాడు, యూపీ, బీహార్, తెలంగాణతో పాటు ఏపీలో కూడా రుజువైందన్నారు. వీటి ప్రత్యామ్నాయ ఎజెండాను బీజేపీ అమలు చేస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. మోదీ వంటి బీసీని ప్రధాని చేసిన పార్టీ బీజేపీ అని అన్నారు. కానీ ఏపీలో బీసీలను సీఎం చేసే పార్టీ ఏదైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు.


అభివృద్ధి వికేంద్రీకరణ అనేది బీజేపీ విధానం..

అభివృద్ధి వికేంద్రీకరణ అనేది బీజేపీ విధానం అని సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. తెలంగాణతో కలిసి ఉండటం వల్ల ఏపీలోని 13 జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని పేర్కొన్నారు. ఇకనైనా అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. స్మశానాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తే అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ రంగులు వేస్తున్నారని విమర్శలు గుప్పించారు. రంగులు వేసుకోవటం కోసమే జగన్ 151 సీట్లు గెలిచారా? అని వీర్రాజు ప్రశ్నించారు. రాజధాని రైతులకు 64వేల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు ఆ పని చేయలేకపోయారని విమర్శించారు. రైతులకు పోగా.. మిగిలిన 9వేల ఎకరాల భూమిని ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఆ భూముల చుట్టూ ఎవరెవరి భూములు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-08-12T00:46:31+05:30 IST